Congress: కాంగ్రెస్’ కార్యకర్తల జోలికొస్తే అధికారపార్టీ అంతుచూస్తాం : టీపీసీసీ చీఫ్ ఉత్తమ్

  • బొడ్డుపల్లి శ్రీనివాస్ మర్డర్ కేసును తప్పుదోవ పట్టిస్తున్నారు
  • ఈ మర్డర్ కేసును సీబీఐకి అప్పగించాలి
  • అధికారపార్టీని గానీ అధికారులను గానీ వదిలిపెట్టం: ఉత్తమ్ హెచ్చరిక

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల జోలికొస్తే అధికార పార్టీ  అంతు చూస్తామని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా హెచ్చరించారు. నల్గొండ మున్సిపల్ చైర్ పర్సన్ లక్ష్మి భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ ఇటీవల హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నిర్వహించిన సంతాప సభకు ఆయన హాజరయ్యారు. ఈ సభలో పాల్గొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, శ్రీనివాస్ హత్యతో జిల్లా మంత్రికి సంబంధం ఉంది కనుకనే కనీసం సంతాపం కూడా తెలపలేదని ఆరోపించారు.

బొడ్డుపల్లి శ్రీనివాస్ ను టీఆర్ఎస్ లో చేరమంటూ నకిరేకల్ ఎమ్మెల్యే వీరేశం బెదిరించారని ఆరోపించారు. తెలంగాణలో ప్రతిపక్ష నాయకుల ఫోన్లను టీఆర్ఎస్ ప్రభుత్వం, పోలీసులు ట్యాప్ చేస్తున్నారని విమర్శించారు. బొడ్డుపల్లి శ్రీనివాస్ మర్డర్ కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని, ఈ వ్యవహారానికి సంబంధించిన వాస్తవాలు బయటపడకూదని సీఎం కేసీఆర్ అనుకుంటున్నారని తెలంగాణ సమాజం భావిస్తోందని విమర్శించారు.

ఈ కేసులో నిందితులను కాపాడాల్సిన అవసరం ఎవరికుందంటూ ఆయన ప్రశ్నించారు. ఈ మర్డర్ కేసును సీబీఐకి అప్పగించి విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడటంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, రాజకీయ ఒత్తిళ్లు కారణంగా పోలీసులు సక్రమంగా పనిచేయలేకపోతున్నారని విమర్శించారు.

శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా విఫలమైందో కేంద్ర హోం శాఖకు తెలియజేస్తామని అన్నారు. తెలంగాణలో దళితులకు, గిరిజనులకు, బీసీలకు అన్యాయం జరుగుతున్న విషయాన్ని భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ దృష్టికి తీసుకెళతామని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను వేధిస్తున్న, హింసిస్తున్న అధికారపార్టీని గానీ అధికారులను గానీ తాము అధికారంలోకి వస్తే వదిలిపెట్టమని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News