Telugudesam: ముగిసిన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం .. మా నిరసన తెలియజేస్తాం: సుజనా చౌదరి

  • చంద్రబాబు అధ్యక్షతన మూడు గంటల పాటు జరిగిన సమావేశం
  • ఏపీకి జరిగిన నష్టంపై చర్చించాం..రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం
  • కొన్ని అంశాలపై రెండుమూడ్రోజుల్లో స్పష్టత రావచ్చు :  మీడియాతో సుజనా చౌదరి

కేంద్ర బడ్జెట్ లో ఏపీకి అన్యాయం జరగడంపై పార్లమెంట్ లో తమ నిరసన వ్యక్తం చేస్తామని టీడీపీ ఎంపీ, కేంద్ర మంత్రి సుజనా చౌదరి అన్నారు. అమరావతిలో టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది. మూడు గంటల పాటు ఈ సమావేశం నిర్వహించారు. అనంతరం, సుజనా చౌదరి మీడియాతో మాట్లాడుతూ, సాధారణంగా జరిగే పార్లమెంటరీ పార్టీ సమావేశం మాదిరే ఇది జరిగిందని అన్నారు.

ఏపీకి జరిగిన నష్టంపై చర్చించామని, బడ్జెట్ లో రాష్ట్రానికి ప్రత్యేకంగా ఎలాంటి నిధులు ఇవ్వలేదని అన్నారు. కేంద్రంతో గట్టిగా మాట్లాడి ఏపీకి రావాల్సిన వాటిని రాబట్టాలని నిర్ణయించుకున్నామని, చర్చలు జరుగుతున్నప్పటికీ నిధులు రావట్లేదని అన్నారు. మూడున్నరేళ్లుగా పోరాడుతూనే ఉన్నామని, రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని, ఏపీకి న్యాయం చేయకపోతే నిరసన తెలియజేస్తామని, పార్లమెంట్ లో తమ నిరసన తెలియజేస్తామని స్పష్టం చేశారు.

కొన్ని అంశాలపై రెండుమూడ్రోజుల్లో స్పష్టత రావచ్చని చెప్పిన ఆయన, రాజీనామాలపై కొందరు ఎంపీలు తమ వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పారని అన్నారు. టీడీపీపై, చంద్రబాబుపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలపై మీడియా ప్రశ్నించగా, ఆ వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని సుజనా చౌదరి అన్నారు.

  • Loading...

More Telugu News