children: చిన్నారులపై అత్యాచారాలకు తెగబడేవారిని చంపేయండి: మోదీకి లేఖ రాసిన ఢిల్లీ మహిళా కమిషన్

  • మీ దృష్టిని ఇటువైపు మరల్చడానికే లేఖ
  • చాలా లేఖలు రాసినా ఒక్క దానికీ సమాధానం లేదు
  • మహిళలు, చిన్నారులకు మీరే దిక్కు
  • లేఖలో డీసీడబ్ల్యూ చైర్‌పర్సన్ స్వాతి మాలివల్

ఢిల్లీలో చిన్నారులపై జరుగుతున్న అత్యాచారాలపై ఆందోళన వ్యక్తం చేసిన ఢిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ) ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాసింది. అభంశుభం తెలియని చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న వారికి మరణశిక్ష విధించాలని డీసీడబ్ల్యూ చైర్‌పర్సన్ స్వాతి మాలివల్ ఆ లేఖలో కోరారు.

గతవారం ఢిల్లీలో ఎనిమిది నెలల చిన్నారిపై జరిగిన అత్యాచారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో ప్రధానికి లేఖ రాసిన స్వాతి.. చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడేవారికి మరణశిక్ష విధించాలని, అటువంటి విధానాన్ని రూపొందించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. కామాంధుడి అఘాయిత్యానికి తీవ్రంగా గాయపడిన చిన్నారి ఎయిమ్స్‌లో ప్రాణాలతో పోరాడుతోందని, ప్రధాని దృష్టిని అటువైపు మళ్లించాలనే ప్రధానికి ఈ లేఖ రాసినట్టు స్వాతి పేర్కొన్నారు.

గత రెండేళ్లుగా ప్రధాని మోదీకి చాలా లేఖలు రాశానని స్వాతి తెలిపారు. వాటిలో ఏ ఒక్కదానికీ సమాధానం లేదని విమర్శించారు. ‘ఇది చిన్నపిల్లపై జరుగుతున్న అత్యాచారం కాదు.. నాపైన. ఇప్పటికే మీకు చాలా లేఖలు రాశా. కానీ సమాధానం మాత్రం లేదు. సర్, నాతో సహా మహిళలు, బాలికలందరికీ మీరే దిక్కు. వారికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత మీపై ఉంది’’ అని లేఖలో పేర్కొన్నారు.

మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అత్యాచారాలకు నిరసనగా నెల రోజులపాటు ‘సత్యాగ్రహం’ చేయనున్నట్టు స్వాతి ఇటీవల ప్రకటించారు. ఈ 30 రోజుల్లో తాను ఇంటికి వెళ్లబోనని, పగలు ఆఫీసులోనే ఉంటానని, రాత్రుళ్లు వివిధ ప్రాంతాలకు వెళ్లి పర్యవేక్షిస్తుంటానని వివరించారు.

  • Loading...

More Telugu News