Chandrababu: తెలంగాణ టీడీపీ బాధ్యతలను జూనియర్ ఎన్టీఆర్ కు అప్పగించండి!: అట్లాంటాలో లోకేష్ కు ప్రవాసుడి సలహా
- వెంటనే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించండి
- అసెంబ్లీ ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయి
- గుంటూరు వాసి నవీన్ సలహా
టీడీపీ నేత, ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ యూఎస్ఏ లోని అట్లాంటాలో పర్యటిస్తూ, ప్రవాస భారతీయులతో సమావేశమైన వేళ, రాష్ట్రాభివృద్ధి, సంక్షేమ పథకాలు, టెక్నాలజీ అందిపుచ్చుకోవడం, రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితులపై పలువురు ఆయనకు సలహాలు, సూచనలు ఇచ్చారు. ఈ క్రమంలో గుంటూరు జిల్లా పాలపర్రుకు చెందిన నవీన్ అనే ప్రవాసాంధ్రుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలపడాలంటే జూనియర్ ఎన్టీఆర్ కు పార్టీ బాధ్యతలు అప్పగించాలని ఆయన సూచించారు. పార్టీ బాధ్యతలను ఎన్టీఆర్ కు అప్పగించి 2019 అసెంబ్లీ ఎన్నికలకు వెళితే, మంచి ఫలితాలు వస్తాయని అన్నారు. నవీన్ ఈ సలహా ఇవ్వగానే అక్కడున్న వందలాది మంది కేరింతలు కొడుతూ, చప్పట్లతో తమ మద్దతు పలకడం గమనార్హం.
ఆపై నవీన్ తన సలహాను కొనసాగిస్తూ, ఈ విషయంలో చంద్రబాబుతో చర్చించి త్వరగా నిర్ణయం తీసుకోవాలని, సాధ్యమైనంత త్వరగా ఎన్టీఆర్ ను తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే, కనీసం 30 సీట్లన్నా గెలుచుకునే అవకాశం ఉంటుందని అన్నారు. 2019లో బీజేపీతో పొత్తు వద్దని, పవన్ కల్యాణ్ ను కలుపుకుని వెళ్లాలని కూడా నవీన్ సూచించారు.