Dawood Ibrahim: మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంకు బ్రిటన్ వ్యాప్తంగా ఆస్తులు.. బయటపెట్టిన పత్రిక
- బ్రిటన్, మొరాకో, భారత్, యూఏఈ, ఆస్ట్రేలియాల్లో దావూద్‌కు పెద్ద ఎత్తున ఆస్తులు
- కథనం ప్రచురించిన ‘ది టైమ్స్’
- తన అనుచరుల ద్వారా ఆస్తులు కూడబెట్టుకున్న‘ఇండియా మోస్ట్ వాంటెడ్’
ఇండియా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు బ్రిటన్ వ్యాప్తంగా ఆస్తులు ఉన్న విషయం వెలుగులోకి వచ్చింది. 1993 ముంబై బాంబు పేలుళ్ల ఘటన సూత్రధారి అయిన దావూద్‌కు మిడ్‌ల్యాండ్స్, ఆగ్నేయ బ్రిటన్, భారత్, యూఏఈ, స్పెయిన్, మొరాకో, టర్కీ, సిప్రస్, ఆస్ట్రేలియాల్లో పెద్ద ఎత్తున ఆస్తులు ఉన్నట్టు బయటపడింది. ఈ మేరకు ‘ది టైమ్స్’ పత్రిక తన కథనంలో పేర్కొంది.
బ్రిటన్‌లోని కంపెనీస్ హౌస్, ల్యాండ్ రిజిస్ట్రీ నుంచి సేకరించిన సమాచారంతో భారత్ తయారుచేసిన దావూద్ ఆస్తుల జాబితాను మీడియా సంస్థ పోల్చి చూసి ఈ వివరాలు వెల్లడించింది. తన సన్నిహితులైన ముహమ్మద్ ఇక్బాల్, ‘మిర్చి’ మీనన్ సాయంతో ఈ ఆస్తులు సమకూర్చుకున్నట్టు పేర్కొంది. ఆయన ఆస్తుల్లో విలాసవంతమైన హోటళ్లు, భవంతులు ఉన్నట్టు తెలిపింది.
దావూద్‌పై ఇప్పటికే ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీ అయింది. బ్రిటన్ ట్రెజరీ ఆంక్షల జాబితాలో ఏళ్లుగా దావూద్ పేరు ఉంది. మహారాష్ట్రలో పుట్టి అండర్ వరల్డ్ డాన్‌గా ఎదిగిన దావూద్ ప్రస్తుతం పాక్‌లో ఉంటున్నట్టు సమాచారం.