Demonetisation: నోట్ల రద్దు సమయంలో రూ.15 లక్షలు డిపాజిట్ చేశారా? అయితే మీరు చిక్కుల్లో పడ్డట్టే!
- రెండు లక్షల మందికి నోటీసులు పంపిన ఐటీ శాఖ
- స్పందించకుంటే జరిమానా
- గత మూడు నెలల్లో 3 వేల మందిపై కేసులు
నోట్ల రద్దు సమయంలో రూ.15 లక్షలు, ఆపైన బ్యాంకుల్లో జమ చేసిన వారిపై ఆదాయపన్ను శాఖ కొరడా ఝళిపించేందుకు సిద్ధమైంది. అలా జమచేసిన దాదాపు రెండు లక్షల మందికి నోటీసులు పంపించింది. నోట్ల రద్దు సమయంలో తమ వ్యక్తిగత ఖాతాల్లో రూ.15 లక్షలు, ఆ పైన జమచేసిన వారిని గుర్తించామని చెప్పిన అధికారులు వారిలో ఆదాయపన్ను చెల్లించని 1.98 లక్షల మందిని గుర్తించి నోటీసులు పంపినట్టు తెలిపారు.
డిసెంబరు, జనవరిలోనే వారికి నోటీసులు పంపినా ఇప్పటి వరకు వారి నుంచి ఎటువంటి స్పందన లేదని పేర్కొన్నారు. నోటీసులకు స్పందించకుంటే జరిమానాలు తప్పవని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) చైర్మన్ సుశీల్ చంద్ర హెచ్చరించారు. పన్ను ఎగవేత, పన్ను చెల్లించడంలో ఆలస్యం తదితర కారణాలపై గత మూడు నెలల్లో 3వేల మందిపై కేసులు నమోదు చేసినట్టు తెలిపారు.