USA: చూశాము కదా... ఫ్యాన్ మాడి మసైపోయింది: అట్లాంటాలో లోకేష్
- అమెరికాలో పర్యటిస్తున్న నారా లోకేష్
- అట్లాంటాలో ఎన్నారైలతో భేటీ
- 2019 నాటికి పోలవరం ద్వారా నీరు
- ఎన్నికల్లో గెలిచేది టీడీపీయే: లోకేష్
నవ్యాంధ్రకు పెట్టుబడులను తీసుకురావడమే లక్ష్యంగా ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్న నారా లోకేష్, అట్లాంటాలో ప్రవాస భారతీయులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏపీలో తొమ్మిది నెలల్లో రెండు నదులను అనుసంధానం చేసి చూపించిన ఘనత చంద్రబాబుదని అన్నారు. 2019 నాటికి పోలవరం ద్వారా నీరు అందించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తున్నదని, సంక్షేమ పథకాల అమలు తీరును ప్రజలు మెచ్చుకుంటున్నారని చెప్పారు. ఈ విషయాన్ని గత సంవత్సరంలో జరిగిన కాకినాడ పురపాలక సంఘం ఎన్నికలు, నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నికల్లో తేటతెల్లమైందని అన్నారు. ఈ ఎన్నికల్లో జగన్ పార్టీ నామరూపాల్లేకుండా పోయిందని అన్నారు.
"చంద్రబాబు నాయకత్వాన్ని మరింత బలోపేతం చేయాల్సి వుంది. నాకు అందులో ఎటువంటి సందేహమూ లేదు. మొన్న ఉప ఎన్నికల్లో చూశాము. నంద్యాల్లో చూశాం. కాకినాడలో చూశాం. ఫ్యాన్ మాడి మసైపోయింది. నాకు సందేహం లేదు. నాకు ఎలాంటి సందేహం లేదు. 2019లో కూడా తెలుగుదేశం పార్టీ భారీ మెజారిటీతో గెలుస్తుంది. కానీ, ఇక్కడున్న ఎన్నారైలను కోరేది ఒక్కటే. ఆంధ్రరాష్ట్రంలో జరిగే అభివృద్ధిలో భాగం కండి" అని ఆయన అన్నారు. ప్రతి సంక్రాంతికీ స్వదేశానికి వచ్చి, టీడీపీ చేపట్టిన సంక్షేమ పథకాలకు మద్దతివ్వాలని కోరారు.