Arun Jaitly: ఇక చాలు! ఎన్డీయేకు దండం పెట్టేందుకు సిద్ధమవుతున్న మిత్రపక్షాలు!

  • ఎన్డీఏ కాపురంలో చిచ్చురేపిన బడ్జెట్
  • వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలిసి వెళ్లబోమని ఇప్పటికే ప్రకటించిన శివసేన
  • నేడు నిర్ణయం ప్రకటించనున్న టీడీపీ
  • బడ్జెట్‌పై తీవ్ర అసంతృప్తిలో మిత్ర పక్షాలు

ఎన్డీయేతో కాపురానికి ఇక రాం.. రాం  చెప్పేందుకు మిత్రపక్షాలు సిద్ధమవుతున్నాయి. ఆశించిన స్థాయిలో లేని బడ్జెట్ వీరి కాపురంలో చిచ్చుపెట్టింది. బడ్జెట్ నిరాశాజనకంగా ఉండడంతో ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు తెగదెంపులకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే బడ్జెట్‌పై తెలుగుదేశం పార్టీ, శివసేన బహిరంగంగా తమ అసంతృప్తిని వ్యక్తం చేశాయి. పంజాబ్‌లోని శిరోమణి అకాలీదళ్, బిహార్‌లోని రాష్ట్రీయ లోక్ సమతా పార్టీలు బయటకు రావాలా? వద్దా? అన్న మీమాంశలో ఉన్నాయి. బడ్జెట్ బాగుందని ప్రకటించినప్పటికీ జేడీయూ కూడా తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నట్టు సమాచారం.

విభజన సమస్యల పరిష్కారం కోసం బడ్జెట్‌లో ఏమాత్రం చొరవ చూపలేదని టీడీపీ, మహారాష్ట్రలో రైతు ఆత్మహత్యల నిరోధానికి ఎటువంటి చర్యలు ప్రకటించలేదని శివసేన రగిలిపోతున్నాయి. ఇక బడ్జెట్‌పై శిరోమణి అకాలీదళ్, జేడీయూలకు కూడా  నిరాశ ఎదురవడంతో జీర్ణించుకోలేకపోతున్నాయి.

బడ్జెట్‌పై  శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. ఎన్డీయే ప్రవేశపెట్టిన బడ్జెట్ చదవడానికి బాగుందని ఎద్దేవా చేశారు. గుజరాత్ ఎన్నికలను ట్రైలర్‌గా పేర్కొన్న ఆయన రెండు రోజుల క్రితం విడుదలైన రాజస్థాన్ ఉప ఎన్నికల ఫలితాన్ని ఇంటర్వెల్‌గా అభివర్ణించారు. ఇక్కడ జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ మూడు సిట్టింగ్ స్థానాలనూ కోల్పోయింది. మరోవైపు తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై స్వయంగా బీజేపీ ఎంపీలే పెదవి విరుస్తున్నారు. దీనిని చూపించి ప్రజల్లోకి ఎలా వెళ్లాలో తెలియక మథనపడుతున్నారు.

ఈ నేపథ్యంలో ఎన్డీయేతో కలిసి వెళ్తే మొదటికే మోసం వస్తుందని గ్రహించిన మిత్రపక్షాలు ఒక్కొక్కటీ బీజేపీకి దండం పెట్టి తమ దారి తాము చూసుకోవాలని భావిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీకి వెళ్లబోమని శివసేన ఇప్పటికే ప్రకటించగా, టీడీపీ నేడు నిర్ణయం తీసుకోనుంది. బీజేపీతో తెగదెంపులకు అకాలీదళ్, రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ,  హిందుస్థానీ అవామ్ మోర్చాలు కూడా సిద్ధమవుతున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News