TRS: బొడ్డుపల్లి హత్య కేసులో కీలక మలుపు... టీఆర్ఎస్ ఎమ్మెల్యే వీరేశం పాత్రపై ఆధారాలు!
- జనవరి 24న హత్య
- ముందు రోజంతా 'వేముల' బ్యాచ్ తో నిందితుల మంతనాలు
- సెల్ ఫోన్ల కాల్ డేటా పరిశీలనలో వెల్లడి
- వీరేశం చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
జనవరి 24న జరిగిన కాంగ్రెస్ నేత బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యకేసులో ట్విస్టుల మీద ట్విస్టులు బయటకు వస్తున్నాయి. శ్రీనివాస్ తో పాటు నిందితుల కాల్ డేటా ఆధారంగా దర్యాఫ్తును చేపట్టిన పోలీసులు నిర్ఘాంతపోయే నిజాలను వెలుగులోకి తెస్తున్నారు. వీరి సెల్ ఫోన్ల నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్న కుమారులకు పలుమార్లు కాల్స్ వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. హత్య జరిగిన రోజంతా నిందితులతో వేముల సుధీర్, వేముల రంజిత్ మాట్లాడుతూనే ఉన్నారని, వీరితోపాటు మరో ఇద్దరు స్నేహితులకు కూడా ఫోన్ కాల్స్ వెళ్లాయని గుర్తించారు. హత్య జరిగిన మరుసటి రోజు ఉదయం వరకు నిందితులు నకిరేకల్ లోనే ఉన్నారని కూడా తేల్చారు.
ఈ కేసులో తొలుత నుంచి కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలకు బలం చేకూర్చేలా పరిణామాలు మారుతుండటంతో, ప్రాధమిక దర్యాఫ్తు చేపట్టిన పోలీసుల తీరుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు సుధీర్, రంజిత్ లను విచారించలేదని, నిందితులను ప్రశ్నించడంపైనా నిర్లక్ష్యం వహించారని భావిస్తున్న పోలీసు ఉన్నతాధికారులు, జిల్లా ఎస్పీపై వేటు వేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు కేసును దర్యాఫ్తు చేసిన ఇనస్పెక్టర్ వెంకటేశ్వర్లు మాయం కావడం కూడా అధికార పార్టీ నేతల ప్రమేయంపై సందేహాలు పెంచుతున్నాయి. టీఆర్ఎస్ నేతల ఒత్తిళ్లతోనే ఇనస్పెక్టర్ వెంకటేశ్వర్లు అదృశ్యం అయినట్టు కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.
జనవరి 24 అర్ధరాత్రి 11:50 నుంచి 12:10 గంటల మధ్య శ్రీనివాస్ హత్య జరుగగా, కేసులో నిందితులుగా ఉన్న రాంబాబు, మల్లేశ్, ఆ రోజు ఉదయం నుంచి వేముల రంజిత్, వేముల సుధీర్ లతో టచ్ లో ఉన్నట్టు వారి ఫోన్ కాల్‌డేటా పరిశీలనలో బయటపడింది. మిర్చి బండి వద్ద జరిగిన గొడవ నుంచి శ్రీనివాస్ హత్య వరకు నిందితులు ప్రతి విషయాన్నీ సుధీర్, రంజిత్ లకు ఫోన్ లో వివరించినట్లు వారి కాల్ డేటా స్పష్టం చేస్తోంది. మల్లేశ్ ఫోన్ నంబర్ 9533423191కు సుధీర్ ఫోన్ నంబర్ 7013863277 నుంచి కాల్ వచ్చింది. వీరు 39 సెకన్లు మాట్లాడుకున్నారు. సుధీర్ స్నేహితుడు సంపత్ ఫోన్ నంబర్ 9966449992 నుంచి 10:20 గంటల సమయంలో మల్లేశ్ కు ఫోన్ వెళ్లింది.
ఆపై ఈ కేసులో రెండో నిందితుడిగా ఉన్న రాంబాబు ఫోన్ నంబర్ 9885056608 నుంచి మల్లేశ్ కు కాల్ వెళ్లింది. ఆ తరువాత మల్లేశ్ మరో నాలుగు నంబర్లకు కాల్ చేసి మాట్లాడాడు. హత్య జరిగిన వెంటనే మల్లేశ్, విష్ణులు మాట్లాడుకోగా, ఆపై వెంటనే సంపత్ నుంచి, తర్వాత వేముల సుధీర్ నుంచి మల్లేశ్ కు ఫోన్ కాల్స్ వెళ్లాయని పోలీసులు తేల్చారు. శ్రీనివాస్ భార్య లక్ష్మి కేసు విచారణ జరుగుతున్న తీరుపై హైకోర్టులో పిటిషన్ వేయడంతోనే పోలీసు శాఖపై ఒత్తిడి పెరుగగా, కేసు వీరేశం మెడకు చుట్టుకుంటోందని పోలీసు వర్గాలు వెల్లడించాయి.