BJP: బీజేపీకి ట్రిపుల్ తలాక్ చెప్పిన తొలి రాష్ట్రం రాజస్థాన్: శత్రుఘ్నసిన్హా
- రాజస్థాన్ ఎన్నికల ఫలితాలపై ట్విట్టర్ ద్వారా స్పందించిన శత్రుఘ్నసిన్హా
- మన ప్రత్యర్ధులు రికార్డు మెజారిటీతో గెలుస్తూ మనకు ఝలక్ ఇస్తున్నారు
- మేలుకుని నష్టనివారణ చర్యలు చేపడితే సరి, లేదంటే టాటా గుడ్ బై చెబుతారు
దేశంలో బీజేపీకి తొలిసారి ట్రిపుల్ తలాక్ చెప్పిన రాష్ట్రం రాజస్థాన్ అని షాట్ గన్ గా పేరుగాంచిన ఆ పార్టీ ఎంపీ శత్రుఘ్న సిన్హా విమర్శించారు. రాజస్థాన్ లో జరిగిన ఉపఎన్నికల ఫలితాలపై ట్విట్టర్ మాధ్యమంగా స్పందిస్తూ, 'బ్రేకింగ్ న్యూస్: అధికార పార్టీకి విపత్కర ఫలితాలు వచ్చాయి. బీజేపీకి ట్రిపుల్ తలాక్ చెప్పిన మొదటి రాష్ట్రంగా రాజస్థాన్ నిలిచింది. అజ్మీర్: తలాక్, అల్వార్: తలాక్, మండల్ గఢ్: తలాక్. మన ప్రత్యర్థులు రికార్డు మెజారిటీతో ఎన్నికల్లో గెలుస్తూ.. మనకు ఝలక్ ఇస్తున్నారు' అని పేర్కొన్నారు. ఇప్పటికైనా బీజేపీ మేలుకొని నష్ట నివారణ చర్యలు చేపడితే సరి లేదా త్వరలోనే బీజేపీకి టాటా-బైబై చెప్పే ఫలితాలు చవిచూడాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.