women detective: భారతీయ తొలి మహిళా డిటెక్టివ్ రజనీ అరెస్ట్
- అక్రమ మార్గాల్లో కాల్ రికార్డులను తెప్పించుకుంటున్నారనే ఆరోపణలు
- అరెస్ట్ చేసిన ముంబై పోలీసులు
- స్కాంలో ఉన్న ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేస్తామన్న థానే పోలీస్ చీఫ్
మన దేశ తొలి మహిళా డిటెక్టివ్ రజనీ పండిట్ (54)ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. టెలికాం కంపెనీల నుంచి అక్రమ మార్గాల్లో ఆమె కాల్ రికార్డింగ్ లను తెప్పించుకుంటోందనే ఆరోపణల నేపథ్యంలో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అక్రమ మార్గాల్లో కాల్ డీటెయిల్ రికార్డ్స్ (సీడీఆర్)లను సంపాదించి, అమ్ముతున్న నలుగురు డిటెక్టివ్ ల గ్యాంగ్ ను నిన్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒకరైన సమ్రేష్ ఘాను విచారించగా... సీడీఆర్ లను రజనీ తెమ్మన్నారని, భారీ మొత్తంలో డబ్బు ఇస్తామని చెప్పారని తెలిపాడు.
ఈ నేపథ్యంలో ఈరోజు రజనీ ఇంటికి వెళ్లిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా థాణే పోలీస్ చీఫ్ పరంబీర్ సింగ్ మాట్లాడుతూ, ఈ రాకెట్ లో రజనీ హస్తం ఉందనే విషయం స్పష్టంగా తెలుస్తోందని చెప్పారు. ఈ స్కాంతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరినీ పట్టుకుని తీరుతామని అన్నారు. ఇదిలా ఉంచితే, ఈమె జీవిత కథ ఆధారంగానే త్రిష కథానాయికగా ప్రస్తుతం ఓ చిత్రం రూపొందుతోంది.