heart disease: గుండె జబ్బులు, మధుమేహంతో కేన్సర్ ముప్పు!
- 20 శాతం కేన్సర్లకు కారణం అవే
- తైవాన్ శాస్త్రవేత్తల పరిశోధనలో నిర్ధారణ
- నాలుగు లక్షల మందిపై 9 ఏళ్లపాటు అధ్యయనం
- శారీరక శ్రమ, వ్యాయామమే దీనికి ఔషధమని వెల్లడి
గుండె జబ్బులు, మధుమేహంతో బాధపడుతున్నారా? అయితే మరింత జాగ్రత్తగా ఉండాల్సిందే. ఇలాంటి వ్యాధులు ఉన్న వారికి కేన్సర్ కూడా వచ్చే ముప్పు ఎక్కువని తైవాన్ కు చెందిన శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. రక్తంలో అధిక కొలెస్ట్రాల్ స్థాయులు ఎలాగైతే గుండె వ్యాధులకు సూచికగా నిలుస్తాయో.. మధుమేహం, గుండె జబ్బులు కూడా అలా కేన్సర్ కు సూచికలుగా చెప్పవచ్చని స్పష్టం చేస్తున్నారు. ఈ పరిశోధన ఫలితాలతో జనవరి 31న ‘బీఎం’ ఆంగ్ల జర్నల్ లో వ్యాసం ప్రచురితమైంది.
నాలుగు లక్షల మందిపై పరిశోధన
గుండె జబ్బులు, మధుమేహంతోపాటు ఊపిరితిత్తుల వ్యాధుల వంటివి శరీరంలో కేన్సర్ అభివృద్ధి చెందడానికి కారణం అవుతున్నాయని శాస్త్రవేత్తలు తేల్చారు. ఈ అంశానికి సంబంధించి తైవాన్ లో నాలుగు లక్షల మందిపై 9 సంవత్సరాల పాటు పరిశోధన చేశారు. పరిశోధనకు ముందు వీరిలో ఎవరికీ కూడా కేన్సర్ వ్యాధి లేదు. అనంతరం కొన్నేళ్ల పాటు వారి ఆరోగ్య పరిస్థితిని, ఇతర అలవాట్లను పరిశీలించారు. మధ్యలో వారికి వివిధ రకాల వైద్య పరీక్షలు చేశారు. చివరిగా ఈ మొత్తం డేటాను విశ్లేషించి నివేదిక రూపొందించారు.
20 శాతం వీటివల్లే..
తాము పరిశోధన జరిపిన వారిలో కేన్సర్ బారిన పడినవారికి.. ముందు నుంచి ఉన్న ఇతర వ్యాధులు, ఆరోగ్య సమస్యలను, కేన్సర్ కారణాలను విశ్లేషించారు. వీరిలో 20 శాతం మందికి గుండె వ్యాధులు, మధుమేహం, ఊపిరితిత్తుల సమస్యలు వంటివే కేన్సర్ కు కారణమని గుర్తించారు. ఇక కేన్సర్ మరణాల్లో 39 శాతం మరణాలు కేన్సర్ కు ఇతర వ్యాధులు తోడుకావడమే కారణమని నిర్ధారించారు.
ముఖ్యంగా పొగతాగడం, మద్యం, ఊబకాయం, అనారోగ్యకరమైన ఆహార అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం వంటివన్నీ కలిస్తే కేన్సర్ రావడానికి ఎంత అవకాశం ఉంటుందో... తీవ్రమైన ఇతర వ్యాధుల కారణంగా కూడా కేన్సర్ రావడానికి అంతే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు తమ నివేదికలో పేర్కొన్నారు. దీనిపై ఇప్పటికే శాస్త్రవేత్తలకు అవగాహన ఉన్నా.. పెద్దగా దృష్టి సారించలేదని వెల్లడించారు.
జీవితకాలం తగ్గిపోతుంది
తీవ్రస్థాయి వ్యాధుల పరిస్థితిని బట్టి కేన్సర్ వచ్చే అవకాశాలు ఆధారపడి ఉంటాయని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఆయా వ్యాధులను నియంత్రణలో ఉంచుకున్నంత కాలం కేన్సర్ ముప్పు నుంచి దూరంగా ఉండవచ్చని తేల్చారు. తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే బాధితుల జీవితకాలం 13 నుంచి 16 ఏళ్ల వరకు తగ్గిపోతుందని వారు హెచ్చరిస్తున్నారు.
వ్యాయామమే ఔషధం
గుండె జబ్బులు, మధుమేహం, ఊపిరితిత్తుల వ్యాధులు వంటి సమస్యలు ఉన్నవారు కేన్సర్ బారిన పడకుండా ఉండడానికి వ్యాయామమే మంచి ఔషధమని పరిశోధకులు చెబుతున్నారు. ఇలాంటి వారు స్వల్పంగా అయినా రోజూ వ్యాయామం లేదా శారీరక శ్రమ చేస్తే కేన్సర్ వచ్చే ప్రమాదం 40 శాతం మేర తగ్గిపోతుందని స్పష్టం చేస్తున్నారు.