cervical cancer: 16-30 వయసు మహిళలకు సర్వైకల్ కేన్సర్ ముప్పు అధికం!
- బాధితుల్లో 14 శాతం మంది ఈ వయసు వారే
- ఆ తర్వాత 61-85 మధ్య వయసున్న వారు
- ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో ఒక వంతు మనదగ్గరే
యుక్తవయసు మహిళలకు సర్వైకల్ కేన్సర్ ముప్పు అధికంగా ఉన్నట్టు ఓ అధ్యయనంలో వెల్లడైంది. 16-30 మధ్య వయసున్న వారి నుంచి సమీకరించిన శాంపిల్స్ లో 14 శాతం మందికి హ్యుమన్ పాపిలోమా వైరస్ (హెచ్ పీవీ) ఉన్నట్టు బయటపడింది. వీరి తర్వాత 61-85 మధ్య వయసున్న వారిలో సర్వైకల్ కేన్సర్ ముప్పు ఎక్కువగా 8.39 శాతం కనిపించింది. దేశవ్యాప్తంగా 2013 నుంచి 2017 మధ్య 3,000 మందికి ఎస్ఆర్ఎల్ డయాగ్నస్టిక్స్ పరీక్షలు నిర్వహించగా ఆ డేటా ప్రకారం వెలుగుచూసిన విషయాలు ఇవి.
మొత్తం మీద 8.04 శాతం మంది మహిళలకు హెచ్ పీవీ వైరస్ బారిన పడే రిస్క్ ఎక్కువగా ఉన్నట్టు తెలిసింది. ఉత్తరాది వారిలో 10.23 శాతంగా ఉంటే, దక్షిణాది మహిళలకు ఈ రిస్క్ 9.78 శాతంగా ఉంది. మహిళల్లో బ్రెస్ట్ కేన్సర్ తర్వాత అత్యధిక మరణాలకు కారణమవుతున్నది సర్వైకల్ కేన్సరే కావడం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న సర్వైకల్ కేన్సర్ మరణాల్లో మూడింట ఒక వంతు మనదేశంలోనే ఉంటున్నాయి. ఏటా 1,32,000 కేసులు నమోదవుతుండగా, 74,000 మంది మరణిస్తున్నారు. రేపు (ఫిబ్రవరి 4) ప్రపంచ కేన్సర్ దినం.