nannapaneni: మహిళలకు రక్షణ కరువైంది: నన్నపనేని రాజకుమారి
- జస్టిస్ రోహిణిని సన్మానించిన నన్నపనేని, మాగంటి బాబు
- మహిళల్లో మరింత చైతన్యం రావాలన్న నన్నపనేని
- భాషాసంస్కృతుల పరిరక్షణలో మహిళల పాత్ర ప్రధానం: మాగంటి
- మహిళలు మరింత అభివృద్ధి సాధించాలి: జస్టిస్ రోహిణి
మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతున్నప్పటికీ వారికి రక్షణ కరువైందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి అన్నారు. హెడ్ కమిషన్ టూ ఎగ్జామిన్ సబ్ కేటగరైజేషన్ ఆఫ్ ఓబీసీ, ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రోహిణిని ఢిల్లీలో నన్నపనేని, ఏలూరు ఎంపీ మాగంటి బాబు సన్మానించారు. ఢిల్లీలోని మాగంటి బాబు నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, నిర్భయ చట్టం అమలులో ఉన్నప్పటికి మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు జరగడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల రక్షణకు ప్రజల్లో ముఖ్యంగా మహిళలలో మరింత చైతన్యం రావాల్సిన అవసరం ఉందని అన్నారు. అభివృద్ధి చెందుతున్న మన దేశంలో అన్ని రంగాలలో మహిళలు ముందంజలో ఉంటున్నారని, స్వయం ఉపాధి పథకాల ద్వారా నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్న పారిశ్రామికవేత్తలలో మహిళలు అధికంగా ఉన్నారని అన్నారు. అనంతరం, మాగంటి బాబు మాట్లాడుతూ, దేశ ప్రగతి సాధనలో మాతృమూర్తుల కృషి అనితర సాధ్యమని ప్రశంసించారు. మన భాష, సంస్కృతీ పరిరక్షణలో మహిళల పాత్ర ప్రధానమైందని, స్వయం ఉపాధి పథకాలతో ముందుకు సాగుతూ మహిళల్లో ఆత్మ విశ్వాసం పెంపొందించు కుంటున్నారని హర్షం వ్యక్తం చేశారు. జస్టిస్ రోహిణి మాట్లాడుతూ, విద్య, ఆర్థిక, స్వశక్తి రంగాలలో మహిళలు మరింత అభివృద్ధి సాధించాల్సిన అవశ్యకతను ఆమె ప్రస్తావించారు.