Telangana: ‘కాంగ్రెస్’ అధికారంలోకి రాకుంటే నేను, నా కుటుంబం రాజకీయాలకు దూరంగా ఉంటాం!: ఉత్తమ్ కుమార్ రెడ్డి

  • వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో ‘కాంగ్రెస్’దే విజయం
  • కేసీఆర్ కుటుంబ సభ్యుల అహంకారం పెరిగిపోయింది
  • దక్షిణ తెలంగాణలో అన్ని స్థానాలను కాంగ్రెస్ స్వీప్ చేస్తుంది
  • కాంగ్రెస్ నేతలందరూ కలసికట్టుగా ఉన్నారు: ఉత్తమ్

తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకుంటే తాను, తన కుటుంబం రాజకీయాలకు దూరంగా ఉంటామని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, దక్షిణ తెలంగాణలో అన్ని స్థానాలను కాంగ్రెస్ స్వీప్ చేస్తుందని, ఉత్తర తెలంగాణలో మాత్రం తమ పార్టీకి, టీఆర్ఎస్ కు మధ్య పోటీ ఉంటుందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. జాతీయ సర్వే సంస్థలతో కూడా సర్వే చేయించామని, తమ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

 జీహెచ్ఎంసీ ఎన్నికల నాటికి, ఇప్పటికీ రాజకీయాలు చాలా మారాయని, టీఆర్ఎస్ పాలనపై ప్రజలు విసుగెత్తిపోయారని అన్నారు. ప్రజలు సహించలేని స్థాయికి కేసీఆర్ కుటుంబ సభ్యుల అహంకారం పెరిగిపోయిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు కొత్తేమీ కాదని, తెలంగాణ ధనిక రాష్ట్రం కావడం వెనుక తమ పార్టీ ఘనతే ఉందని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని, నిరుద్యోగ భృతి, వరికి రూ.3 వేల మద్దతు ధర కల్పిస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ నేతలందరూ కలసికట్టుగా ఉన్నారని,  కోమటిరెడ్డి బ్రదర్స్ తనకు విలువైన సహచరులు అని అన్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో బస్సుయాత్ర, మే, జూన్  నెలల్లో తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని ఈ సందర్భంగా ఉత్తమ్ ప్రకటించారు.

  • Loading...

More Telugu News