Narendra Modi: ‘మోదీ కేర్’కు ఏటా అయ్యే ఖర్చు ఎంతంటే..!
- కేంద్రం నిన్న ప్రకటించిన జాతీయ ఆరోగ్య పరిరక్షణ పథకం
- దీని అమలుకు ఏటా అయ్యే ఖర్చు రూ.11,000 కోట్లు
- అంతకు మించి కూడా ఖర్చు అవ్వచ్చన్న ఉన్నతాధికారి
పేదల కోసం ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా పథకాన్ని కేంద్ర బడ్జెట్ లో నిన్న ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయుష్మాన్ భారత్ కింద ప్రకటించిన రెండు ప్రధాన పథకాలలో ఒకటి జాతీయ ఆరోగ్య పరిరక్షణ పథకం (ఎన్ హెచ్ పీఎస్). దీనిని ‘మోదీ కేర్’ గా వ్యవహరిస్తున్నారు. ఈ పథకం కింద పది కోట్ల కుటుంబాల ద్వారా 50 కోట్ల మంది ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది.
ఈ పథకం ద్వారా మధ్య, ఉన్నత స్థాయి ఆసుపత్రుల్లో చికిత్స పొందే నిమిత్తం కుటుంబానికి ఏడాదికి రూ. 5 లక్షల వరకూ కవరేజ్ లభించనుంది. 2018-19లో ఈ పథకం కోసం రూ.2 వేల కోట్లు కేటాయిస్తున్నట్టు కేంద్ర వ్యయ శాఖ కార్యదర్శి ఎఎన్ ఝా నిన్న పేర్కొన్నారు. ఈ పథకం ఎప్పటి నుంచి ప్రారంభించేది నిర్దిష్టంగా వెల్లడించని ఆయన, ఏప్రిల్ 1నుంచి నిధులు అందుబాటులో ఉంటాయని చెప్పడం విదితమే.
అయితే, ఈ పథకాన్ని అమలు చేయడానికి ఏటా అయ్యే ఖర్చు రూ.11,000 కోట్లు అని పేరు చెప్పడానికి నిరాకరించిన ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. ఏటా అయ్యే ఖర్చులు పదకొండు వేల కోట్లకు మించి కూడా అయ్యే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. కాగా, పలు రాష్ట్రాల్లో ఆరోగ్య బీమాకు సంబంధించిన పథకాలను ఆయా ప్రభుత్వాలు అందిస్తున్నాయి. కానీ, అవి అంత సమర్థవంతంగానూ నిర్వహించట్లేదు.
ఇదిలా ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు అనారోగ్యానికి గురైతే చికిత్స నిమిత్తం అయ్యే ఖర్చులను భరించలేని పరిస్థితి వుంది. చాలా మంది ప్రజలను ఈ సమస్య పట్టి పీడిస్తోంది. ఈ నేపథ్యంలోనే ‘మోదీ కేర్’ పథకం రూపొందినప్పటికీ, రాజకీయ విశ్లేషకులు మాత్రం మరో కోణాన్ని బయటపెట్టారు. వచ్చే ఏడాది సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ పథకాన్ని ప్రవేశపెడుతున్నారని అంటున్నారు.