rayapati: సీఎంతో భేటీ తరువాత నిర్ణయం.. బీజేపీతో దోస్తీపై ఎంపీ రాయపాటి
- కేంద్ర బడ్జెట్‌పై తీవ్ర అసంతృప్తిలో టీడీపీ నేతలు
- బడ్జెట్ కేటాయింపుల్లో ఏపీకి అన్యాయం-రాయపాటి
- విశాఖ రైల్వేజోన్ ఏర్పాటు విషయంపై కూడా నమ్మకం లేదు
- సీఎం చంద్రబాబుతో ఎల్లుండి సమావేశం
పార్లమెంటులో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై టీడీపీ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. బీజేపీతో తమకు ఉన్న మైత్రి రాష్ట్రానికి ఏ మాత్రం ఉపయోగపడలేదంటూ బహిరంగంగానే వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై స్పందించిన టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆశాజనకంగా లేదని అన్నారు. తాజాగా ఆయన గుంటూరు జిల్లాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాయపాటి మీడియాతో మాట్లాడుతూ... బడ్జెట్ కేటాయింపుల్లో ఏపీకి అన్యాయం జరిగిందన్నారు. విశాఖ రైల్వేజోన్ ఏర్పాటు విషయంపై కూడా నమ్మకం లేదని అన్నారు. బీజేపీతో మైత్రిని కొనసాగించాలా? వద్దా? అన్న అంశంపై సీఎం చంద్రబాబుతో ఎల్లుండి సమావేశం జరుపుతున్నామని, ఆ తర్వాత ఓ నిర్ణయానికి వస్తామని తేల్చి చెప్పారు.