Chandrababu: టీడీపీలో 'డిన్నర్' టెన్షన్.. చంద్రబాబు నుంచి ఫోన్ వస్తుందేమోనన్న భయంలో ఎమ్మెల్యేలు!
- 40 మంది ఎమ్మెల్యేలపై నెగెటివ్ రిపోర్ట్
- వచ్చే ఎన్నికల్లో టికెట్ లేనట్టే
- ఇంటికి పిలిచి, భోజనం పెట్టి, సాగనంపాలనుకుంటున్న చంద్రబాబు
'కుటుంబ సమేతంగా భోజనానికి రండి' అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి ఫోన్ వస్తుందేమో అనే భయంలో టీడీపీ నేతలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. స్వయానా చంద్రబాబే ఫోన్ చేసి... భోజనానికి రండి అని పిలిస్తే... ఆనందంగా వెళ్లొచ్చు కదా, ఎందుకంత టెన్షన్ అనుకుంటున్నారా? దీని వెనుక పెద్ద కథే ఉంది.
టీడీపీ ప్రజాప్రతినిధుల పనితీరును ప్రస్తుతం చంద్రబాబు సమీక్షిస్తున్నారు. ఎమ్మెల్యేల పనితీరుపై పార్టీ, నిఘావర్గాలు, ఇతర సంస్థల నుంచి తెప్పించుకున్న సర్వేలను ఆయన వడపోశారు. ప్రజల్లో వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేల జాబితాను సిద్ధం చేసుకున్నారు. దాదాపు 40 మంది ఎమ్మెల్యేలపై నియోజకవర్గాల్లో వ్యతిరేకత ఎక్కువగా ఉందనే నిర్ణయానికి ఆయన వచ్చారట. పనులు చేశామని చెప్పుకుంటే సరిపోదని, అహంకారాన్ని పక్కనపెట్టి ప్రజలతో మమేకం కావాలని ఇంతకు ముందే చాలా సందర్భాల్లో ఎమ్మెల్యేలకు చంద్రబాబు క్లాస్ పీకారు. అయినా, కొందరిలో ఎలాంటి మార్పు రాలేదు. ఇక వారిపై వేటు వేయాలనే నిర్ణయానికి టీడీపీ అధినేత వచ్చారు.
ఇటీవల జరిగిన ఓ పార్టీ సమావేశంలో చంద్రబాబు బాంబు పేల్చారు. 'ఇన్ని రోజులు పార్టీ కోసం పని చేశారు. అలాంటివారిని అవమానకరంగా సాగనంపకుండా... కుటుంబసభ్యులతో సహా ఆహ్వానించి, భోజనం పెట్టి, వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి, సాగనంపుదాం' అని చంద్రబాబు అన్నారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఎందుకు ఇవ్వలేకపోతున్నామో వారికి అర్థమయ్యేలా చెప్పి, పంపించేద్దామని తెలిపారు.
ఇప్పుడు ఈ విషయం ఎమ్మెల్యేలు అందరికీ తెలిసిపోయింది. దీంతో, అందర్లో టెన్షన్ నెలకొంది. 'కుటుంబ సమేతంగా భోజనానికి రండి' అంటూ ఎక్కడ ఫోన్ వస్తుందో అని బెంబేలెత్తిపోతున్నారు. చంద్రబాబు నుంచి కాల్ వచ్చిందంటే... ఇక తమ రాజకీయ జీవితానికి శుభం కార్డు పడినట్టే అని కంగారు పడుతున్నారు.
దావోస్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత చంద్రబాబు ప్రస్తుతం పార్టీ కార్యాకలాపాలపై ఎక్కువ దృష్టి సారించారు. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో, పని చేయని ఎమ్మెల్యేలను సాగనంపడమే మంచిదనే కృత నిశ్చయంతో ఆయన ఉన్నారు. మధ్యాహ్నం వరకు సెక్రటేరియట్ లో ఉండి, ఆ తర్వాత తన నివాసంలోని సమావేశ మందిరంలో పార్టీ వ్యవహారాలను చూసుకుంటానని ఆయన స్పష్టం చేశారు. ఇకపై ప్రతిరోజు సాయంత్రం ఒక్కో నియోజకవర్గంపై దృష్టి సారించి... ఏ నియోజకవర్గంలో అయితే పార్టీ పరిస్థితి దారుణంగా ఉందో, సదరు ఎమ్మెల్యేను భోజనానికి పిలిపించి, సాగనంపాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఈ నిర్ణయమే ఇప్పుడు టీడీపీలో కలకలం రేపుతోంది.