West Bengal: వెస్ట్ బెంగాల్ ఉప ఎన్నికల్లో ఓడినా ఆనందిస్తున్న బీజేపీ... కారణమిదే!
- గణనీయంగా పెరిగిన బీజేపీ ఓట్ల శాతం
- దారుణంగా పడిపోయిన కాంగ్రెస్ ఓట్లు
- ప్రధాన ప్రతిపక్షం తామేనంటున్న బీజేపీ
దశాబ్దాల వామపక్ష పార్టీల పాలన తరువాత, ప్రస్తుతం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ అధీనంలోకి వచ్చిన పశ్చిమ బెంగాల్ లో, ఇటీవలి ఉప ఎన్నికలు, బీజేపీకి విజయాన్ని దగ్గర చేయకపోయినప్పటికీ ఆనందాన్ని మిగిల్చాయి. ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఉలుబెరియా పార్లమెంట్ నియోజకవర్గాన్ని, నౌపారా అసెంబ్లీ సీటును గెలుచుకోగా, బీజేపీ రెండో స్థానంలో నిలిచింది. గతంలో ఈ సీట్లలో డిపాజిట్లను సైతం దక్కించుకోలేకపోయిన బీజేపీ, ఇప్పుడు తృణమూల్ కు గట్టి పోటీ ఇచ్చే స్థాయికి రావడం ఆనందకరమని ఆ పార్టీ నేతలు వ్యాఖ్యానించారు.
ఉలుబెరియా స్థానంలో దివంగత ఎంపీ సుల్తాన్ అహ్మద్ భార్య సాదిజా అహ్మద్, తన సమీప బీజేపీ ప్రత్యర్థిపై 4.5 లక్షల ఓట్ల తేడాతో విజయం సాధించారు. 2014లో జరిగిన ఈ నియోజకవర్గ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 67,826, బీజేపీకి 1,37,137 ఓట్లు రాగా, ప్రస్తుతం కాంగ్రెస్ 23,168 ఓట్లకు దిగజారగా, బీజేపీ గణనీయంగా బలపడి 2,93,018 ఓట్లను దక్కించుకుంది. 2014 ఎన్నికలతో పోలిస్తే, బీజేపీకి 12 శాతం అధిక ఓట్లు వచ్చాయి. సానుభూతి పవనాల మధ్య కూడా తమ పార్టీ మంచి ప్రభావాన్ని చూపిందన్న ఆనందాన్ని బీజేపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్ లో ఇక తామే ప్రధాన ప్రతిపక్షమని, మమతా బెనర్జీని గద్దె దించుతామని వ్యాఖ్యానించారు.