Virat Kohli: ఏడేళ్ల తర్వాత తొలిసారి దక్షిణాఫ్రికాలో వన్డే గెలిచిన భారత్.. ఆ గడ్డపై కోహ్లీ తొలి సెంచరీ!
- సఫారీల 17 వరుస విజయాలకు కోహ్లీ సేన బ్రేక్
- దక్షిణాఫ్రికాలో కోహ్లీ తొలి సెంచరీ
- చివరిసారి 2011లో దక్షిణాఫ్రికాపై వన్డేల్లో విజయం
ఆరు వన్డేల సిరీస్‌లో భాగంగా గురువారం డర్బన్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 269 పరుగుల విజయ లక్ష్యాన్ని భారత్ కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఫలితంగా ఆరు వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యం సంపాదించింది. ఈ విజయంతో పలు రికార్డులు నమోదయ్యాయి. దక్షిణాఫ్రికాలో భారత్ ఏడేళ్ల తర్వాత సాధించిన తొలి విజయమిది. జనవరి 18, 2011న చివరిసారి సఫారీ గడ్డపై భారత్ విజయాన్ని నమోదు చేసింది. ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు వన్డేల్లో విజయం సాధించింది. అంతేకాదు.. సొంతగడ్డపై 17 వరుస విజయాలతో దూకుడుమీదున్న డుప్లెసిస్ సేనకు భారత్ కళ్లెం వేసింది.
ఇక ఈ మ్యాచ్‌లో 112 పరుగులతో కెరీర్‌లో 33వ సెంచరీ నమోదు చేసిన కోహ్లీకి సఫారీ గడ్డపై మొదటి శతకం కావడం గమనార్హం. ఈ సెంచరీతో కోహ్లీ ఖాతాలో మొత్తం 54 సెంచరీలు చేరాయి. అతడి కంటే ముందు జాక్విస్ కలిస్ (62), కుమార్ సంగక్కర (63), రికీ పాంటింగ్ (71), సచిన్ టెండూల్కర్ (100) ముందున్నారు. ఈ సెంచరీకి ముందు సౌతాఫ్రికాలో కోహ్లీ అత్యధిక స్కోరు 87(నాటౌట్) మాత్రమే.