Sujana Chowdary: ఏపీ ప్రజలను నిరాశ పరిచిన బడ్జెట్ ఇది!: కేంద్ర మంత్రి సుజనాచౌదరి
- ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన సుజనా చౌదరి
- ఏపీ ప్రజలు చెప్పేదే మా వాదం
- ‘కేంద్రం’పై ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది
ఈ బడ్జెట్ ఏపీ ప్రజలను నిరాశ పరిచిందని కేంద్ర మంత్రి సుజనా చౌదరి అన్నారు. ఢిల్లీలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘2018-19 బడ్జెట్ చాలా నిరాశ పరిచింది. ప్రజలతో పాటు ఎంపీలందరూ నిరాశగా ఉన్నారు. ‘పోలవరం’, ‘మెట్రో’ అంశాల గురించి బడ్జెట్ లో ప్రస్తావించి ఉంటే బాగుండేది. మహారాష్ట్ర, కర్ణాటక రాష్టాలకు రైల్వే కేటాయింపులు భారీగా చేశారు.
ఏపీలో విజయవాడ, విశాఖపట్ణణంలో ‘మెట్రో’ కేటాయింపుల గురించి మాట్లాడలేదు. ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, ప్లాట్ ఫామ్ ల ఆధునికీకరణ వంటి చిన్న చిన్నవే ఏపీకి కేటాయించినట్టు కనబడింది. ఏపీ ప్రజలు చెప్పేదే మా టీడీపీ వాదం. సాధ్యాసాధ్యాలను మరోమారు బేరీజ్ చేసుకుని మిత్రపక్షంలో ఉన్న మేము గట్టిగా పోరాడతాం.. కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది..మా ప్రయత్నాలు మేము చేస్తాం.
బడ్జెట్ విషయమై కేంద్రం దృష్టి ఏపీపై పెట్టించాల్సిన అవసరమైతే ఉంది. గత నాలుగేళ్లలో కేంద్రంపై మేము ఒత్తిడి చేసిన మేరకు కొంతవరకు సాధించామని అనుకుంటున్నాం. అయితే, ఇంకా సాధించాల్సింది ఉందని మేము భావిస్తున్నాం. తదుపరి కార్యాచరణపై మా అధినేత చంద్రబాబు నాయుడితో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. మా అధినేత చంద్రబాబుతో ఆదివారం సమావేశమై ఆయన సూచనల మేరకు నడచుకుంటాం. ఏపీకి రైల్వే జోన్ ని తీసుకొచ్చి తీరతాం’ అని చెప్పుకొచ్చారు.