UAE: మ్యాచ్ ఫిక్సింగ్ చూసి షాక్ తిన్న ఐసీసీ... ఆటగాళ్లు ఎలా అవుటయ్యారో మీరు కూడా చూడండి!
- యూఏఈలో అజ్మన్ వేదికగా జరిగిన అజ్మన్ ఆల్ స్టార్స్ క్రికెట్ లీగ్
- దుబాయ్ స్టార్స్, షార్జా వారియర్స్ జట్ల మధ్య మ్యాచ్
- 136 పరుగుల విజయ లక్ష్యం నిర్దేశించిన దుబాయ్ స్టార్స్
- 46 పరుగులు చేసిన షార్జా వారియర్స్
యూఏఈలోని అజ్మన్ వేదికగా జరిగిన ఒక టీ20 మ్యాచ్ లో జరిగిన మ్యాచ్ ఫిక్సింగ్ ను చూసిన ఐసీసీ షాక్ కు గురైంది. 136 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన జట్టు బౌలర్లు, ఫీల్డర్లకు ఏ మాత్రం శ్రమ ఇవ్వకుండా అవుటైన తీరు అంపైర్లతో పాటు, ప్రేక్షకులు, ఐసీసీ, క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది.
దాని వివరాల్లోకి వెళ్తే... అజ్మన్ ఆల్ స్టార్స్ క్రికెట్ లీగ్‌లో భాగంగా దుబాయ్ స్టార్స్, షార్జా వారియర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన దుబాయ్ స్టార్స్ 136 పరుగుల లక్ష్యాన్ని ప్రత్యర్థుల ముందుంచింది. ఆ తరువాతే అసలు కథ మొదలైంది. బ్యాటింగ్ కు దిగిన వారియర్స్ జట్టు ఆటగాళ్లు ఎప్పుడెప్పుడు ఔట్ అవుదామా అన్నట్లు క్రీజ్ లోకి వచ్చారు.
వస్తూనే బంతులను ఆడడం వదిలేస్తూ క్రీజ్ బయటకు వచ్చి స్టంప్ ఔట్ అయ్యారు. మరి కొందరు అనవసరమైన పరుగుల కోసం ప్రయత్నించి కావాలనే రన్ ఔట్ అయ్యారు. ఇది మ్యాచ్ చూసిన ఎవరికైనా అర్ధమయ్యేలా జరిగింది. ఇంత చేసినా ఆ జట్టు 46 పరుగులు చేయడం విశేషం. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇలా వైరల్ అవుతూ, ఇది ఐసీసీని చేరింది. దీంతో ఈ మ్యాచ్ వీడియోను చూసి ముక్కున వేలేసుకున్న అధికారులు, దీనిని తీవ్రంగా పరిగణించి, తమ అవినీతి నిరోధక శాఖ అధికారులను దీనిపై విచారణ జరపాలని ఆదేశించారు. విచారణ పూర్తయ్యేంత వరకు అజ్మన్ ఆల్ స్టార్స్ క్రికెట్ లీగ్ నిర్వహించవద్దని తేల్చిచెప్పింది. దానిని మీరు కూడా చూడండి.