Andhra Pradesh: గంజాయి సాగు, రవాణా చేసే వారిపై పీడీ చట్టం కింద కేసులు నమోదు చేయాలి: ఏపీ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు
- గంజాయి సాగు నివారణపై సమీక్ష సమావేశం
- ఎక్సైజ్, పోలీస్, అటవీశాఖలు సమన్వయంతో పని చేయాలి
- ఉదాసీనంగా వ్యవహరించే ఉద్యోగులపై కఠిన చర్యలు తప్పవు
- ఆదేశించిన దినేష్ కుమార్
రాష్ట్రంలో గంజాయి సాగును పూర్తిగా నివారించాలని, ఈ సాగు చేపట్టినా లేదా రవాణా చేసిన సదరు వ్యక్తులపై పీడీ చట్టం కింద కేసులు నమోదు చేయాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ ఆదేశించారు. ఏపీ సచివాలయంలోని తన కార్యాలయంలో గంజాయి సాగు నివారణపై ఏపీ డీజీపీ మాలకొండయ్యతో కలిసి ఎక్సైజ్, అటవీ, పోలీస్ శాఖల ఉన్నతాధికారులతో ఈరోజు సమీక్షించారు.
ఈ సందర్భంగా దినేష్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్రంలో గంజాయి సాగును పూర్తిగా భూస్థాపితం చేయాల్సిన అవసరం ఉందని, గంజాయి సాగు లేదా రవాణా చేసే వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారిపై పీడీ చట్టం కింద కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ఇందుకుగాను ఎక్సైజ్, పోలీస్, అటవీ శాఖలు సమన్వయంతో పనిచేస్తూ వారి తనిఖీ, నిఘా వ్యవస్థలను మరింత పటిష్టం చేయాలని ఆదేశించారు. ఎక్కడైనా గంజాయి సాగుచేస్తున్నట్టు లేదా రవాణా చేస్తున్నట్టు సమాచారం అందితే సంబంధిత అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గంజాయి సాగు చేస్తున్న సమాచారం తెలిసి కూడా ప్రేక్షకపాత్ర వహించవద్దని అన్నారు. తనిఖీల్లో గంజాయిని స్వాధీనం చేసుకోవడం, దాడులు నిర్వహించడం ఒక్కటే ఈ సమస్యకు పరిష్కారం కాదని, సాగును పూర్తిగా నివారించగలిగితేనే ఈ సమస్యకు పరిష్కారం లభించినట్టవుతుందని అన్నారు.
గంజాయి సాగు చేస్తున్నట్టు గుర్తించిన ప్రాంతాల్లో డ్రోన్ల సహాయంతో పరిశీలించి ఆ పంటను ధ్వంసం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, మారుమూల కొండ ప్రాంతాలకు వెళ్లే అవకాశం లేని చోట్ల గంజాయి సాగు చేస్తున్నట్టు గుర్తిస్తే ఆయా ప్రాంతాలకు వెళ్లి ఆ పంటను ధ్వంసం చేసేందుకు వీలుగా హెలికాఫ్టర్ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు.
అంతేగాక, గంజాయి సాగుపై సమాచారం ఇచ్చే వారికి తగిన ప్రోత్సాహక బహుమతులను అందించాలని, ఎక్సైజ్, పోలీస్, అటవీ శాఖల చెక్ పోస్టులను, తనిఖీ వ్యవస్థలను మరింత పటిష్టం చేయాలని అధికారులను ఆదేశించారు. గంజాయి సాగు జరిగితే అందుకు సంబంధిత మండల స్థాయి అధికారులు, సిబ్బందిదే పూర్తి బాధ్యతని, అవసరమైతే వారిని ఉద్యోగం నుండి తొలగించడం వంటి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందనే భయాన్ని ఈ మూడు శాఖల ఉద్యోగుల్లో కల్పించాలని, ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే తదుపరి పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని మూడు శాఖల ఉన్నతాధికారులకు సిఎస్ స్పష్టం చేశారు.
ఈ విధంగా స్థానిక గంజాయి సాగుదారుల్లోను, ఉద్యోగుల్లోను ఒక భయాన్ని కలిగించగలిగితే గంజాయి సాగుకు సంబంధించి సగం సమస్య పరిష్కారం అవుతుందని అన్నారు. ఇప్పటికే స్వాధీనం చేసుకున్న గంజాయిని ఫిబ్రవరి నెలాఖరులోగా ధ్వంసం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా డీజీపీ ఎం.మాలకొండయ్య మాట్లాడుతూ గంజాయి రవాణాకు సంబంధించి ఇప్పటి వరకూ 800 వాహనాలను స్వాధీనం చేసుకున్నామని, గంజాయి సాగుకు సంబంధించి 17 గ్యాంగుల జాబితాను సీఐడీ పోలీస్ విభాగానికి అందించి నిఘాను ముమ్మరం చేయడం జరిగిందని అన్నారు. 150 టన్నుల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగిందని దానిని ధ్వంసం చేసేందుకు తగు చర్యలు తీసుకోవాల్సి ఉందని చెప్పారు. ఒడిశా రాష్ట్రంలో గంజాయి సాగు అధికంగా ఉందని ఆ రాష్ట్ర అధికారులు సమన్వయంతో దీనిని నివారించేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు.
ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డా.సాంబశివ రావు మాట్లాడుతూ, రాష్ట్రంలో విశాఖ జిల్లాలో ఎక్కువ ప్రాంతంలోను, తూర్పు గోదావరి జిల్లాల్లో కొంతమేర గంజాయి సాగు జరుగుతోందని 3 వేల 107 ఎకరాల్లో ఈసాగు జరుగుతున్నట్టు గుర్తించడం జరిగిందని తెలిపారు. దానిలో 563 ఎకరాల అటవీ, 2 వేల 543 రెవెన్యూ భూముల్లోనే సాగు చేస్తున్నట్టు గుర్తించామని చెప్పారు. ఎక్సైజ్ కమిషనర్ లక్ష్మీ నర్సింహం మాట్లాడుతూ సాధీనం చేసుకున్న గంజాయిని జిల్లా స్థాయి కమిటీ ఆ మొత్తాన్ని నిర్ధారణ చేశాక ధ్వంసం చేసేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు.