ambati rayudu: క్రికెటర్ అంబటి రాయుడిపై రెండు మ్యాచ్ ల నిషేధం!
- సయ్యద్ అలీ ట్రోఫీలో నిబంధనలు ఉల్లంఘించిన రాయుడు
- తీవ్రంగా పరిగణించిన బీసీసీఐ
- రెండు మ్యాచ్ ల నిషేధం
టీమిండియా క్రికెటర్, హైదరాబాద్ రంజీ జట్టు కెప్టెన్ అంబటి రాయుడుపై రెండు మ్యాచ్ ల నిషేధాన్ని బీసీసీఐ విధించింది. సయ్యద్ అలీ ట్రోఫీలో భాగంగా కర్ణాటకతో జరిగిన మ్యాచ్ సందర్భంగా అంబటి నిబంధనలు పాటించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ఈ రోజు ప్రకటన జారీ చేసింది.
11వ తేదీన జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ ఫీల్డర్ మెహదీ హసన్ బంతిని ఆపే ప్రయత్నంలో పొరపాటున బౌండరీ లైన్ ను తాకాడు. దాన్ని గమనించని అంపైర్లు రెండు రన్లుగా డిక్లేర్ చేశారు. దీంతో, 20 ఓవర్లలో కర్ణాటక 203 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత కర్ణాటక కెప్టెన్ వినయ్ కుమార్ ఈ విషయాన్ని థర్డ్ అంపైర్ కు తెలపగా... ఆయన మరో 2 పరుగులు అదనంగా ఇచ్చారు. దీంతో, కర్ణాటక స్కోరు 205 పరుగులు అయింది.
ఆ తర్వాత ఛేజింగ్ చేసిన హైదరాబాద్ 203 పరుగులు చేసింది. పాత స్కోరు ప్రకారం అయితే మ్యాచ్ టై అయింది. రెండు పరుగులు మళ్లీ కలపడంతో, కర్ణాటక విజయం సాధించింది. ఈ నేపథ్యంలో, అంపైర్లపై అంబటి రాయుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. సూపర్ ఓవర్ అయినా నిర్వహించాలని అంబటి రాయుడు పట్టుబట్టినా... అంపైర్లు అంగీకరించలేదు.
దీంతో, మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా హైదరాబాద్ ఆటగాళ్లు మైదానంలోనే ఉండిపోయారు. దీంతో, తర్వాత జరగాల్సిన ఆంధ్ర-కేరళ మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమై... 13 ఓవర్ల మ్యాచ్ గా ముగిసింది. దీనికి సంబంధించిన నివేదికను అంపైర్లు బీసీసీఐకి పంపించగా... రాయుడి చర్యలను బీసీసీఐ తీవ్రంగా పరిగణించింది. రాయుడిపై చర్యలు తీసుకుంది. నిబంధనలను ఉల్లంఘించినట్టు రాయుడు అంగీకరించాడని... రెండు మ్యాచ్ ల నిషేధానికి అంగీకరించాడని బీసీసీఐ తెలిపింది.