Telangana: తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా శైలేంద్ర కుమార్ జోషి
- ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్రప్రభుత్వం
- ముగిసిన ప్రస్తుత సీఎస్ ఎస్పీ సింగ్ పదవీ కాలం
- ఉత్తరప్రదేశ్‌లోని బరేలీకి చెందిన జోషి
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి శైలేంద్ర కుమార్ జోషి నియమితులయ్యారు. రేసులో చాలా మంది ఉన్నప్పటికీ సుమారు రెండేళ్లు సర్వీసు ఉన్న జోషి వైపే ముఖ్యమంత్రి కేసీఆర్ మొగ్గు చూపారు. ప్రస్తుత సీఎస్ ఎస్పీ సింగ్ పదవీకాలం బుధవారంతో ముగియనున్న నేపథ్యంలో నూతన సీఎస్‌గా జోషిని నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
ప్రస్తుతం ఇరిగేషన్ శాఖలో ప్రత్యేక ముఖ్య కార్యదర్శిగా ఆయన బాధ్యతలు వహిస్తున్నారు. ఆయన డిసెంబర్ 20, 1959లో ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో ఆయన జన్మించారు. 1984లో ఆయన ఐఏఎస్‌గా జాయిన్ అయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో అసిస్టెంట్ కలెక్టర్‌గా ఆయన వృత్తి జీవితం ప్రారంభించారు. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖలో తొమ్మిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో రియో డీ జెనిరోలో జరిగిన యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్‌మెంట్ అండ్ డెవలప్‌మెంట్‌లో కూడా ఆయన పాల్గొన్నారు.