dust bag: చెత్త మూటకు బదులు డబ్బు మూటను పడేశాడు!
- ఒక చేతిలో చెత్తమూట, మరో చేతిలో డబ్బు మూట ఉండటంతో గందరగోళం
- బ్యాంక్‌కి వెళ్లాక గుర్తించిన చైనా వ్యక్తి వాంగ్
- డబ్బు తిరిగి దొరకడంతో ఆనందం
కొన్నిసార్లు అనుకోకుండా జరిగిన పనులు చాలా ఇబ్బందికి గురిచేస్తాయి. రెండు చేతుల్లో ఒకే విధంగా కనిపించే వస్తువులు ఉన్నప్పుడు గందరగోళానికి గురవడం సహజం. అలాంటి గందరగోళమే చైనాలోని లియోనింగ్ ప్రాంతానికి చెందిన వాంగ్‌ని ముప్పుతిప్పలు పెట్టింది. వివరాల్లోకి వెళ్తే.... నెల రోజుల క్రితం బ్యాంక్‌లో 124,000 యువాన్లు (అంటే దాదాపు రూ.12 లక్షలు) డిపాజిట్ చేసేందుకు వాంగ్ వెళ్లాడు.
ఎటూ బయటికి వెళ్తున్నా కదా అని ఇంట్లో ఉన్న చెత్త కవర్‌ను బయటపడేయాలనుకున్నాడు. అలా ఒక చేతిలో డబ్బు కవర్, మరో చేతిలో చెత్త మూట పట్టుకుని వెళ్లాడు. ఏదో ఆలోచనలో పడి పొరపాటున చెత్త మూటకు బదులు డబ్బు కట్టలు ఉన్న కవర్ పడేశాడు. బ్యాంక్‌కి వెళ్లిన తర్వాత గానీ విషయం బయటపడలేదు. దీంతో లబోదిబోమంటూ వెంటనే డబ్బు పడేసిన చోటికి వెళ్లి వెతికాడు. కానీ అప్పటికే ఆ మూట ఓ యువతి కంట పడింది.
డబ్బు మూట తీసుకున్న యువతి దాన్ని స్థానిక పోలీస్‌స్టేషన్‌లో అప్పగించింది. అదృష్టం కొద్దీ అదే పోలీస్ స్టేషన్‌లో వాంగ్ ఫిర్యాదు చేయడంతో వాళ్లు సీసీటీవీ ఫుటేజీ పరిశీలించి, అది అతనిదే అని నిర్ధారించుకుని ఆ డబ్బును వాంగ్‌కి తిరిగిచ్చారు. ఆ యువతి నిజాయతీకి బహుమతిగా వాంగ్ ఆమెకు 2000 యువాన్లు ఇచ్చాడు.