lunar eclipse: సాయంత్రం 6.20 నుంచి 7.37 వరకు... ఆకాశంలో ఈ అద్భుతాన్ని వీక్షించండి!
- నేడు కనువిందు చేయనున్న సూపర్ బ్లడ్ మూన్
- ఇదే సమయంలో సంపూర్ణ చంద్రగ్రహణం
- వీక్షించేందుకు రెడీ అయిన యావత్ ప్రపంచం
ఈ సాయంత్రం అంతరిక్షంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమవుతోంది. సంపూర్ణ చంద్రగ్రహణం కనువిందు చేయనుంది. సాధారణ చంద్రగ్రహణాల కంటే ఇది చాలా విభిన్నమైంది. బ్లూమూన్ తో పాటు, సూపర్ బ్లడ్ మూన్ కూడా ఒకే సమయంలో రానుంది. దీంతో, ప్రపంచం మొత్తం ఈ అద్భుతాన్ని చూసేందుకు రెడీ అయిపోయింది. శాస్త్రవేత్తలు కూడా తమ ప్రయోగాలకు సిద్ధమయ్యారు.
చంద్రగ్రహణం కారణంగా క్రమంగా చంద్రుడి రంగు మారుతుంది. సాధారణంగా ప్రతి రెండేళ్ల 8 నెలలకు ఒకసారి చంద్రుడు బ్లూమూన్ గా మారుతాడు. కానీ, ఈరోజు ఎర్రగా రక్తపు వర్ణంలోకి మారి బ్లడ్ మూన్ గా అవతరించనున్నాడు. బ్లడ్ మూన్ కు చంద్రగ్రహణం తోడవడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది వరల్డ్ అయింది.
భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మహాద్భుతం 7.37 గంటల వరకు కొనసాగనుంది. ఈ సందర్భంగా చంద్రుడు 14 శాతం పెద్దగా, 30 శాతం కాంతిమంతంగా కనిపిస్తాడు. పశ్చిమ కోస్తా ప్రాంతంలో ఉండే వారికి ఈ అద్భుతం మరింత స్పష్టంగా కనిపిస్తుంది. 152 ఏళ్ల తర్వాత ఈ సూపర్ బ్లడ్ మూన్ కనువిందు చేయబోతోంది. ఓవైపు ఈ చంద్ర గ్రహణాన్ని చూడకూడదని జ్యోతిష్కులు చెబుతుంటే... శాస్త్రవేత్తలు మాత్రం నాన్సెన్స్ అని కొట్టిపడేస్తున్నారు.