IPL: ఐపీఎల్ దేనికి?.. క్రికెట్ కోసమా?.. బెట్టింగుల కోసమా?: బాంబే హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
- ఫెమా ఉల్లంఘన కేసులో లలిత్ మోదీపై ఆరోపణలు
- విచారణ సందర్భంగా కోర్టు సంచలన వ్యాఖ్యలు
- ఐపీఎల్ పుణ్యమా అని ఫిక్సింగ్-బెట్టింగ్ పదాలు బహుళ ప్రాచుర్యం పొందాయని వ్యాఖ్య
- ఐపీఎల్ దేనికోసమో తెలుసుకోవాల్సి ఉందన్న కోర్టు
ఐపీఎల్‌పై బాంబే హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఐపీఎల్ తెరపైకి వచ్చాక ఫిక్సింగ్-బెట్టింగ్ పదాలు బాగా ప్రాచుర్యం పొందాయని పేర్కొంది. ఇంతకీ ఐపీఎల్ దేనికోసమని ప్రశ్నించింది. ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీపై నమోదైన విదేశీ మారక నిల్వల (ఫెమా) ఉల్లంఘన కేసు విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఐపీఎల్ విజయవంతమైనా గత పదేళ్లలో జరిగిన ఆర్థిక అవకతవకలు, కేసుల మాటేమిటని న్యాయమూర్తులు జస్టిస్ ధర్మాధికారి, భారతి దంగ్రేలు ప్రశ్నించారు.
ఫెమా ఉల్లంఘన కేసులో సాక్షుల క్రాస్ ఎగ్జామినేషన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అనుమతి నిరాకరణపై 2015లో మోదీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మంగళవారం దీనిని విచారించిన కోర్టు పై వ్యాఖ్యలు చేసింది.
ఐపీఎల్ పుణ్యమా అని ఫిక్సింగ్, బెట్టింగ్ పదాలు బాగా ప్రాచుర్యం పొందాయని పేర్కొన్న కోర్టు.. ఐపీఎల్ క్రికెట్ కోసమా? కాదా? అనే విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఈ కేసులో సాక్షుల క్రాస్ ఎగ్జామినేషన్‌ను తమ మార్గదర్శనంలోనే చేయాలని ఈడీని ఆదేశించింది. మార్చి 2న మొదలయ్యే ఈ ప్రక్రియను అదే నెల 13లోగా పూర్తి చేయాలని, ప్రొసీడింగ్స్‌ను మార్చి 31లోపు పూర్తి చేయాలని ఆదేశించింది. 2009లో దక్షిణాఫ్రికాలో జరిగిన ఐపీఎల్‌లో ఫెమా ఉల్లంఘనలు జరిగినట్టు ఈడీ ఆరోపిస్తోంది.