Donald Trump: ఆ 11 దేశాలపై నిషేధాన్ని ఎత్తేస్తున్నాం: అమెరికా ప్రకటన
- 11 దేశాలపై నిషేధం విధించిన ట్రంప్
- ట్రంప్ నిర్ణయాన్ని తప్పుబట్టిన న్యాయస్థానాలు
- వెనక్కి తగ్గి నిషేధం ఎత్తివేసిన ట్రంప్
ఇరాన్, ఇరాక్, లిబియా, ఈజిప్టు, మాలి, సోమాలియా, దక్షిణ సూడాన్, సుడాన్, సిరియా, యెమెన్ తో పాటు ఉత్తరకొరియాను అత్యంత ప్రమాదకర దేశాలుగా అభివర్ణిస్తూ.. ఆయా దేశాల నుంచి వచ్చే శరణార్థులపై నిషేధం విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ నిర్ణయాన్ని న్యాయస్థానాలు తీవ్రంగా తప్పుబట్టడంతో అమెరికా పట్టు సడలించింది. ఈ పదకొండు దేశాలపై నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది. నిషేధం ఎత్తివేస్తున్నా వారిపై కఠిన నిబంధనలు మాత్రం కొనసాగుతాయని చెప్పింది.
దీంతో ఈ దేశాల నుంచి వచ్చే శరణార్థులు గతంలో కన్నా కఠినతరమైన తనిఖీలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హోమ్ లాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్ట్ జెన్ నిల్సన్ తెలిపారు. ఇతర మతాలను లక్ష్యం చేసుకుని తామీ నిర్ణయం తీసుకోలేదని, దేశ రక్షణలో భాగంగా పలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. అమెరికాకు ఎలాంటి వారు వస్తున్నారనేది తెలుసుకోవడం తమకు అత్యంత ప్రధానమైన అంశంగా ఉందని ఆయన తెలిపారు. అందుకే వలస జీవులు గతంలో కంటే కఠిన నిబంధనలు ఎదుర్కోనున్నారని ఆయన చెప్పారు.