sharukh khan: బాలీవుడ్ బాద్షా షారూక్‌కు షాక్.. ఫామ్ హౌస్ అటాచ్
- బినామీ ఆస్తుల చట్టం కింద కొరడా ఝళిపించిన అధికారులు
- డేజా వు ఫామ్స్ ప్రైవేటు లిమిటెడ్ పేరుతో భూమి కొనుగోలు
- వ్యవసాయం కోసం కొన్న భూమిని వ్యక్తిగత అవసరాలకు ఉపయోగం
బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్‌కు ఆదాయపన్ను శాఖ ఝలకిచ్చింది. డేజా వు ఫార్మ్స్ ప్రైవేటు లిమిటెడ్ పేరుతో అలీబాగ్‌లో ఉన్న ఆయన ఫామ్ హౌస్‌ను అటాచ్ చేసింది. బినామీ ఆస్తుల నిరోధక చట్టంలో భాగంగా ఐటీ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఆదాయపన్ను శాఖ సీనియర్ అధికారుల కథనం ప్రకారం.. కొన్నేళ్ల క్రితం షారూక్ వ్యవసాయం కోసమని డేజా వు ఫామ్స్ ప్రైవేటు లిమిటెడ్ పేరుతో 19,960 చదరపు మీటర్ల స్థలాన్ని కొనుగోలు చేశాడు. అయితే వ్యవసాయం కోసం కొన్న ఆ భూమిని తన విలాసాల కోసం, వ్యక్తిగత అవసరాల కోసం ఉపయోగించుకుంటున్నాడు. ఈ మొత్తం ఆస్తి విలువ రూ.14.6 కోట్లు కాగా, మార్కెట్ రేటు అందుకు 5 రెట్లు అధికంగా ఉంటుంది.
వ్యవసాయం పేరుతో కొనుగోలు చేసిన ఈ భూమిని వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించుకుంటుండడంతో ‘బినామీ ట్రాన్సాక్షన్’ చట్టం సెక్షన్ 2 (9) కింద దీనిని బినామీగా గుర్తించినట్టు అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా ఈ ఫామ్ హౌస్‌ను అటాచ్ చేసినట్టు పేర్కొన్నారు.