Telangana: రేపటి నుంచి తెలంగాణ కుంభమేళా.. మేడారం జాతరకు పోటెత్తనున్న భక్తులు
- రేపటి నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు సమ్మక్క-సారలమ్మ జాతర
- తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర నుంచి తరలిరానున్న భక్తులు
- చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్న అధికారులు
తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన మేడారం జాతర, సమ్మక్క-సారలమ్మ జాతర రేపటి నుంచి ప్రారంభం కానుంది. ప్రతి రెండేళ్ల కొకసారి మాఘ శుద్ధ పౌర్ణమి రోజున ప్రారంభమై నాలుగు రోజుల పాటు ఈ జాతర కొనసాగుతుంది. రేపటి నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు జరగనున్న ఈ జాతరకు భక్తులు పోటెత్తనున్నారు. తెలంగాణ రాష్ట్ర పండగ, ఆసియాలో అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం జాతరకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర నుంచి భక్తులు రానున్నారు. ఇక్కడికి వచ్చే భక్తులకు గతంలో విడిది ఏర్పాట్లు లేవు. ప్రస్తుతం ప్రభుత్వం ఆ సౌకర్యాన్ని కల్పించింది.
* పదివేల మంది పోలీసులతో బందోబస్తు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 400 సీసీ కెమెరాలు, 4 డ్రోన్ కెమెరాలు, క్రౌడ్ కౌంటింగ్ కెమెరాలు, వీఎస్ఎం తెరలు 10. వీటన్నింటిని ఒకే చోట నుంచి నిర్వహించేందుకు కమాండ్ కంట్రోల్ గది ఏర్పాటు
* 20 శాఖలకు చెందిన 29 వేల మంది సిబ్బంది సేవలు
* వచ్చే భక్తుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆధునిక గుడారాలు
* పర్యాటక శాఖ ఆధ్వర్యంలో 46, అటవీశాఖ ఆధ్వర్యంలో 100 గుడారాలు అందుబాటులో ఉంటాయి. వీటి అద్దె విషయానికొస్తే.. 24 గంటలకు - రూ.2 వేలు, 12 గంటలకు - రూ.1000
* మేడారం వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ బుకింగ్ చేసుకునే అవకాశం
* తాగునీటి కోసం మిషన్ భగీరథ జలాలు
* జాతర పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు, వ్యర్థాలను తొలగించేందుకు ట్రాక్టర్లు, మినీ వ్యాన్ల ఏర్పాటు
* పారిశుద్ధ్య పనుల కోసం 450 మంది సిబ్బంది, 3 వేల మంది కూలీలు
* జాతర పరిసరాల్లోని పది కిలోమీటర్ల పరిధిలోని 450 ప్రదేశాల్లో 10,458 మరుగుదొడ్లు
* తాత్కాలిక ఏటీఎం కేంద్రాలు, 3జీ, 4జీ సేవలు, బీఎస్ఎన్ఎల్ ఉచిత వైఫై సేవలు
* జాతరకు వచ్చే భక్తుల కోసం సెల్ఫీ, ఫొటోగ్రఫీ, లఘుచిత్రం పోటీలు. విజేతలకు రూ.4.25 లక్షల నగదు బహుమతులు