domestic markets: ఆద్యంతం నష్టాల బాటలో కొనసాగిన దేశీయ మార్కెట్లు
- 200 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
- 81 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
- చాలా రోజులకు నష్టాల్లో సాగిన సూచీలు
కొత్త కొత్త రికార్డులను తిరగరాస్తూ దూసుకుపోయిన స్టాక్ మార్కెట్లు ఇవాళ వెనక్కి తగ్గాయి. బడ్జెట్ ప్రకటనకు రెండు రోజుల ముందు ఇలా జరగడంతో మదుపర్లు తీవ్రఅసంతృప్తికి గురయ్యారు. దేశీయ కంపెనీల్లో లాభాల స్వీకరణకు మదుపర్లు ఆసక్తి చూపించడంతో మార్కెట్లు ప్రారంభం నుంచే నష్టాల బాట పట్టాల్సి వచ్చింది.
ఈ ఉదయం 80 పాయింట్లకు పైగా నష్టంతో ట్రేడింగ్‌ను ఆరంభించిన సెన్సెక్స్ ఆ తర్వాత ఏ దశలోనూ కోలుకోలేదు. ఆద్యంతం ఒత్తిడికి గురైన సూచీ చివరకు 249 పాయింట్లు దిగజారి 36,034 వద్ద ముగిసింది. అటు నిఫ్టీ కూడా 81 పాయింట్ల నష్టంతో 11,050 వద్ద స్థిరపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 63.67గా కొనసాగుతోంది. ఎన్‌ఎస్‌ఈలో హిందుస్థాన్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హీరోమోటార్స్, కోల్‌ఇండియా షేర్లు లాభపడగా.. ఐషర్ మోటార్స్, కొటక్ మహింద్రా బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, బాష్ లిమిటెడ్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు నష్టపోయాయి.