laknow: వారేమైనా పాకిస్ధానీలా...ఎందుకీ మతపిచ్చి?: వివాదం రేపిన కలెక్టర్ ఫేస్ బుక్ పోస్టు
- ఘర్షణలు చెలరేగినప్పుడల్లా ముస్లింల ఇళ్ల ముందుకు వెళ్లి పాక్ వ్యతిరేక నినాదాలు చేస్తున్నారు
- వారు కూడా భారతీయులే కదా? అలా ఎందుకు చేస్తున్నారు?
- ఇంత మత పిచ్చి ఎందుకు? ఇది దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీస్తుంది
లక్నోలోని కాస్ గంజ్ మత ఘర్షణలపై బరేలీ కలెక్టర్ తన ఫేస్ బుక్ ఖాతాలో చేసిన పోస్టు ఒకటి పెను ప్రకంపనలకు కారణమైంది. కాస్ గంజ్ లో గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా విద్యార్థి సంఘాలు బద్దూ నగర్ లో ‘తిరంగ ర్యాలీ’ నిర్వహించాయి.
ఈ సందర్భంగా విద్యార్థులు పాకిస్ధాన్ వ్యతిరేక నినాదాలు చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగి, హింసాత్మకంగా మారింది. ఈ ఘటనలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోగా, పదుల సంఖ్యలో యువకులు గాయపడ్డారు. దీంతో అక్కడ అల్లర్లు చెలరేగడంతో, కర్ఫ్యూ విధించి, భద్రతా బలగాలను రంగంలోకి దింపారు. 80 మందిని అదుపులోకి తీసుకుని పరిస్థితి చక్కదిద్దారు.
దీనిపై కలెక్టర్ ఆర్. విక్రమ్ సింగ్ తన అభిప్రాయం వ్యక్తం చేస్తూ ‘‘ఈ మధ్యకాలంలో ఒక కొత్త సంప్రదాయం పుట్టుకొచ్చింది. ఘర్షణలు చెలరేగినప్పుడల్లా కొందరు చేసే పనులు విచిత్రంగా ఉంటాయి. మాట్లాడితే ముస్లింల ఇళ్ల ముందుకు వెళ్లి పాక్ వ్యతిరేక నినాదాలు చేస్తున్నారు. ఇదంతా ఎందుకు? వారేమైనా పాకిస్థాన్ వాసులా? కాదు కదా, భారతీయులే కదా?" అంటూ ఫేస్ బుక్ లో సుదీర్ఘమైన పోస్టు పెట్టారు.
పనిలో పనిగా గతేడాది బరేలీలో జరిగిన ఘర్షణల ప్రస్తావన చేస్తూ, అప్పట్లో కొందరు కన్వరియాలు (శైవ భక్తులు) ముస్లింలు అధికంగా ఉండే ప్రాంతంలోకి వెళ్లి, పాక్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ ప్రాంతంలోనే నా నివాసం కూడా ఉంది. బయటికొచ్చిన నేను వారిని అలా చేయొద్దని వారించాను. కానీ, వారు నా మాట వినలేదు. ఇంత మత పిచ్చి వాళ్లకు ఎందుకు? ఇది దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీస్తుంది' అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై తీవ్ర దుమారం చెలరేగింది. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ మతపరమైన వ్యాఖ్యలు చేయడమేంటని, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు మండిపడుతున్నారు.