nakka anadhababu: కాఫీ సాగుచేసే గిరిజన రైతులను గుర్తించాలి: ఏపీ మంత్రి నక్కా ఆనంద బాబు ఆదేశం

  • కాఫీ అభివృద్ధికి సంబంధించి సవివర ప్రాజెక్టు ప్రతిపాదనలను తయారుచేయాలని ఆదేశం
  • ఎన్ఎస్టీ, ఎఫ్డీసి కింద భూమి అభివృద్ధి పనులకు ఎక్కువ సబ్సిడీ మంజూరు చేసేవిధంగా ప్రతిపాదనలు
  • ప్రతి గిరిజన కుటుంబం నెలకు రూ.10వేలు ఆదాయం సంపాదించే విధంగా ప్రణాళికలు

లక్ష ఎకరాలలో కాఫీ అభివృద్ధికి సంబంధించి మొదటి మూడు సంవత్సరాలలో కాఫీ సాగుచేసే గిరిజన రైతులను గుర్తించాలని ఏపీ సాంఘీక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు అధికారులను ఆదేశించారు. సచివాలయం 3వ బ్లాక్ మొదటి అంతస్తులోని తన ఛాంబర్ లో మంత్రి గిరిజన సంక్షేశాఖ, ట్రైకార్ (ట్రైబల్ కార్పోరేషన్) పథకాల అమలు తీరును సమీక్షించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మొదట్లో 11సంవత్సరాలకు ప్రతిపాదించిన కాఫీ ప్రాజెక్టును ఏడు సంవత్సరాలకు పూర్తి చేసేవిధంగా ప్రణాళికలు తయారుచేయాలని అధికారులను ఆదేశించారు. కాఫీ అభివృద్ధికి సంబంధించి ప్రొఫెషనల్ ఏజెన్సీతో సవివర ప్రాజెక్టు ప్రతిపాదనలను తయారుచేసి, వచ్చే నెలలో సమర్పించాలని ప్రాజెక్టు అధికారులను ఆదేశించారు. గత సంవత్సరం, ఈ సంవత్సరంలో మంజూరు చేసిన బ్యాంకు లింక్ పథకాలను ఫిబ్రవరి నెలాఖరులోగా గ్రౌండ్ చేయాలన్నారు.

2014-15, 2015-16లో గ్రౌండ్ చేయని పథకాల సబ్సిడీ నిధులను వెనక్కి తీసుకోని ట్రైకారుకు జమచేయాలని ఆదేశించారు. ఎన్ఎస్టీ, ఎఫ్డీసి కింద భూమి అభివృద్ధి పనులకు ఎక్కువ సబ్సిడీ మంజూరు చేసేవిధంగా ప్రతిపాదనలు తయారుచేయాలన్నారు. ఇందులో రుణాలకు యూనిట్ కాస్ట్ కు 50 శాతం సబ్సిడీ ఇచ్చే విధంగా, మిగిలినది టర్మ్ లోన్ గా మంజూరు చేసి గిరిజనులకు ఎక్కువ ఆదాయం సమకూరే విధంగా ప్రణాళికలు రూపొందించాలన్నారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి గిరిజన కుటుంబం నెలకు రూ.10 వేలు ఆదాయం సంపాదించే విధంగా ప్రణాళికలు చేపట్టాలన్నారు. పివిటీజీల అభివృద్ధికి సమగ్రంగా సర్వే చేసి వార్షిక ప్రణాళిక తయారు చేయాలని చెప్పారు. భూమి కొనుగోలు పథకంపై అవగాహన కలిగించి ఎక్కువ మంది గిరిజనులు లబ్దిపొందే విధంగా ఎక్కవ ప్రతిపాదనలు వచ్చేలా చూడాలన్నారు.

స్కిల్ డెవలప్ మెంట్ శిక్షణా కార్యక్రమాల ద్వారా ఉపాధి పొందినవారు ఎక్కువ కాలం అదేపనిలో కొనసాగే వృత్తులను లేద పనులను గుర్తించి తగిన ప్రతిపాదనలు తయారు చేయమని సూచించారు. ఈ సమావేశంలో సాంఘీక, గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి షంషేర్ సింగ్ రావత్, ట్రైకార్ ఎండి ఇ.రవీంద్రబాబు, ఐ.టి.డి.ఏ పీఏఓలు, పీహెచ్ఓలు, కాఫీ విభాగం అసిస్టెంట్ డైరెక్టర్, డీటీడబ్ల్యూఓలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News