Paytm: ఆఫీస్ బాయ్ ని ఒక్కసారిగా లక్షాధికారిగా మార్చిన పేటీఎం!
- నమ్ముకున్న ఉద్యోగులకు పేటీఎం అందించిన బొనాంజా
- గతంలో కంపెనీల్లో వాటాను ఇచ్చిన పేటీఎం
- విలువ పెరగడంతో అమ్మి సొమ్ము చేసుకుంటున్న ఉద్యోగులు
పేమెంట్ చెల్లింపు సేవల మాధ్యమం పేటీఎం, డీజిటల్ లావాదేవీల్లో శరవేగంగా దూసుకెళుతూ, తనను నమ్మిన ఉద్యోగులను లక్షాధికారులుగా మార్చేస్తోంది. తాజాగా ఆ కంపెనీ రెండో విడత స్టాక్స్ విక్రయాన్ని చేపట్టగా, అందులో పని చేస్తున్న పలువురు ఉద్యోగులు తమకున్న మైనారిటీ వాటాలను (ఈస్వాప్స్) భారీ మొత్తానికి విక్రయించుకున్నారు. ఈ క్రంలో పేటీఎం ఆఫీస్ బాయ్ రూ. 20 లక్షలకు పైగా సంపాదించుకున్నాడని 'వన్ 91 కమ్యూనికేషన్ లిమిటెడ్' పేర్కొంది.
ఆ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ హరీందర్ థాకర్ కు ఏకంగా రూ. 40 కోట్లు దక్కాయని తెలిపింది. కాగా, పేటీఎం సంస్థ విస్తరణ బాట పట్టిన తరవాత, సంస్థలో ఉద్యోగులకు స్థాయిని బట్టి 10 నుంచి 100 వరకూ ఈక్విటీ వాటాలను యాజమాన్యం అందించింది. ఇక గత సంవత్సరం మార్చితో పోలిస్తే, ఈ సంవత్సరం జనవరిలో పేటీఎం విలువ దాదాపు రూ. 20 వేల కోట్లకు పైగా పెరగడంతో వారి వాటాల విలువ కూడా పెరిగింది. ప్రస్తుతం పేటీఎంలో సాఫ్ట్ బ్యాంకు, ఎస్‌ఏఐఎఫ్ పార్టనర్స్, అలీబాబా గ్రూప్ హోల్డింగ్ లిమిటెడ్, యాంట్ ఫైనాన్సియల్ సర్వీసెస్ గ్రూప్ సంస్థలు ఇన్వెస్టర్లుగా ఉన్న సంగతి తెలిసిందే.