Under-19 world cup: అండర్-19 ప్రపంచకప్: పాక్ ఓటమి ఖరారు.. ఫైనల్లోకి టీమిండియా!
- 48 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన పాక్
- భారీ ఓటమి దిశగా పయనం
- భారత బౌలర్ల ముందు నిలవలేకపోతున్న పాక్ బ్యాట్స్‌మెన్
న్యూజిలాండ్‌లో జరుగుతున్న అండర్-19 క్రికెట్ ప్రపంచకప్ ఫైనల్లోకి భారత్ ప్రవేశం దాదాపు ఖరారైంది. భారత్ నిర్దేశించిన 273 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్.. భారత బౌలర్ల దెబ్బకు గింగిరాలు తిరుగుతోంది. 24 ఓవర్లలో 48 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి భారీ ఓటమి దిశగా పయనిస్తోంది.
భారత పేసర్ ఇషాన్ పోరెల్ నిప్పులు చెరిగే బంతులకు పాక్ టాపార్డర్ కుప్పకూలింది. ఒకరి తర్వాత ఒకరుగా పాక్ బ్యాట్స్‌మెన్ పెవిలియన్ చేరారు. రియాన్ పరాగ్ కూడా లైన్ అండ్ లెంగ్త్‌లో బంతులు విసురుతూ పాక్‌కు చుక్కలు చూపించాడు. పాక్ బ్యాట్స్‌మెన్‌లలో వికెట్ కీపర్ రోహైల్ నజీర్ (18) తప్ప మరెవరూ సింగిల్ డిజిట్ దాటలేదు.
ఆరు ఓవర్లు వేసిన ఇషాన్ పోరెల్ రెండు మెయిడెన్లు తీసుకుని 17 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. మూడు ఓవర్లు వేసిన రియాన్ పరాగ్ ఓ మెయిడెన్ తీసుకుని 5 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. శివ సింగ్ 2 వికెట్లు తీసుకున్నాడు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది.