under-19 world cup: అండర్-19 ప్రపంచకప్: భారత బౌలర్ ఇషాన్ దెబ్బకు పాక్ గింగిరాలు.. ఓటమి దిశగా పయనం!
- పాక్ వెన్ను విరిచిన భారత్ పేసర్
- 28 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయిన పాక్
- పాక్ శిబిరంలో ఆందోళన
అండర్-19 ప్రపంచకప్ సెమీస్ పోరులో పాక్ ఆదిలోనే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. భారత బౌలర్ ఇషాన్ పోరెల్ దెబ్బకు పాక్ విలవిల్లాడుతోంది. 28 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా పయనిస్తోంది.
భారత్ నిర్దేశించిన 273 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ 10 పరుగుల వద్దే ఓపెనర్ ముహమ్మద్ జైద్ ఆలం (7) వికెట్ను కోల్పోయింది. మరో మూడు పరుగులు జోడించాక మరో ఓపెనర్ ఇమ్రాన్ షా (2) పృథ్వీషా చేతికి చిక్కాడు. 20 పరుగుల వద్ద 3, 28 పరుగుల వద్ద నాలుగు వికెట్లు కోల్పోయిన పాక్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఇషాన్ పోరెల్ నిప్పులు చెరిగే బంతులకు పాక్ బ్యాట్స్మెన్ పెవిలియన్కు క్యూ కడుతున్నారు. పాక్ టాపార్డర్ కుప్పకూలడంతో భారత శిబిరంలో ఆనందం కనిపిస్తోంది.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. శుభ్మన్ గిల్ (102) అజేయ సెంచరీతో ఆకట్టుకున్నాడు. కెప్టెన్ పృథ్వీ షా 41, మన్జోత్ కల్రా 47, అనుకుల్ సుధాకర్ రాయ్ 33 పరుగులు చేశారు.