Telangana: కేసీఆర్ నన్ను చంపించాలని చూస్తున్నారు: వంటేరు ప్రతాప్ రెడ్డి
- బెయిలుపై విడుదలైన వంటేరు
- తెలంగాణను పోలీసు రాజ్యంగా మార్చారని ఆరోపణ
- తనకేదైనా జరిగితే కేసీఆరే బాధ్యత వహించాల్సి ఉంటుందన్న టీడీపీ నేత
ముఖ్యమంత్రి కేసీఆర్ తనను ఎన్‌కౌంటర్ చేయించాలని చూస్తున్నారని టీడీపీ టీఎస్ నేత, తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు వంటేరు ప్రతాప్‌రెడ్డి ఆరోపించారు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి మురళి ఆత్మహత్య అనంతరం జరిగిన అల్లర్లపై కేసులు నమోదు చేసిన పోలీసులు ఈనెల 9న వంటేరును అరెస్ట్ చేశారు. 14 రోజుల రిమాండ్ అనంతరం బెయిలు లభించడంతో సోమవారం రాత్రి చంచల్‌గూడ జైలు నుంచి ఆయన విడుదలయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ తనను పోలీసులతో ఎన్‌కౌంటర్ చేయించాలని చూస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రాన్ని పోలీసు రాజ్యంగా మారుస్తున్నారని పేర్కొన్న ఆయన తనకేదైనా జరిగితే దానికి కేసీఆరే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
వచ్చే ఎన్నికల్లో గజ్వేల్‌లో కేసీఆర్ ఓడిపోవడం ఖాయమని, ఆ భయంతోనే తనపై తప్పుడు కేసులు బనాయించి జైల్లో పెట్టించారని వంటేరు ఆరోపించారు. తనకు జరిగిన అన్యాయాన్ని ఇంటింటికీ తిరిగి మరీ గజ్వేల్ ప్రజలకు వివరిస్తానని అన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందంటూ కోదండరాం పర్యటనకు అనుమతి ఇవ్వని పోలీసులు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఎలా అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు. కాగా, వంటేరు విడుదలవుతున్న సంగతి తెలుసుకున్న వందలాదిమంది కార్యకర్తలు చంచల్‌గూడ జైలు వద్దకు తరలి రాగా, పోలీసులు వారిని చెదరగొట్టారు.