muslim: ముస్లిం మహిళలు ఫుట్‌బాల్ చూడటం నిషేధం... ఫత్వా జారీ
- ఆటగాళ్ల మోకాళ్లు కనిపిస్తుండటమే కారణం
- ముస్లిం చట్టాల ప్రకారం అది తప్పని వ్యాఖ్య
- వివాదాస్పద ఫత్వాలు జారీ చేసే దేవ్‌బంధ్ సంస్థ
ఉత్తర ప్రదేశ్‌కి చెందిన దేవ్‌బంధ్ సంస్థ ముస్లిం మహిళల్లో క్రమశిక్షణ అలవర్చడమనే నెపంతో మరో ఫత్వాను జారీ చేసింది. ఇందులో భాగంగా ఫుట్‌బాల్ ఆటను చూడటంపై నిషేధం విధించింది. ఫుట్‌బాల్ ఆటగాళ్లు మోకాళ్ల వరకు దుస్తులు ధరించడం కారణంగా వారికి ముస్లిం మహిళలు ఆకర్షితులయ్యే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మహిళలు మగ వాళ్లను ఆ విధంగా చూడటం ముస్లిం చట్టాల ప్రకారం పాపం అని దేవ్‌బంధ్ ప్రతినిధి ముఫ్తీ అతర్ కస్మీ అన్నారు.
2015లో సౌదీ అరేబియాలో జారీ చేసిన ఫత్వా ఆధారంగా ఈ కొత్త ఫత్వాను విడుదల చేసినట్లు తెలుస్తోంది. ఫుట్‌బాల్ ఆటలో స్కోర్లు చూస్తూ ఎంజాయ్ చేయడానికి కాకుండా ఆటగాళ్ల కాళ్లను, తొడలను చూడటానికే ముస్లిం మహిళలు ఆసక్తి చూపిస్తున్నారని అప్పట్లో షేక్ సాద్ అల్ హజారీ ఫత్వా జారీ చేశారు. అలాగే భార్యలను ఫుట్‌బాల్ ఆట చూసేందుకు అనుమతిస్తున్న భర్తలకు కూడా ఆ ఫత్వాలో హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పుడు అదే ఫత్వా మార్గదర్శకాలను దేవ్‌బంధ్ సంస్థ కూడా అనుసరించినట్లు సమాచారం.