Budget: ఈ ఏడాది బడ్జెట్ మనకేం ఇస్తుంది.. విశ్లేషణాత్మక అంచనా!
- మరో నాలుగు రోజుల్లో బడ్జెట్
- ఆర్థిక వ్యవస్థకు ఉద్దీపనే లక్ష్యం
- వృద్ధి రేటు పెంచేలా నిర్ణయాలు
- చిన్న వ్యాపారులకు తాయిలాలు
- 'జీఎస్టీ' ఆగ్రహం తొలిగేలా నిర్ణయాలు
మరోసారి పార్లమెంట్ ఎన్నికలు జరిగేలోపు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టబోయే చివరి పూర్తి స్థాయి బడ్జెట్ ఇదే కావడంతో, మరో నాలుగు రోజుల్లో పార్లమెంట్ ముందుకు రానున్న బడ్జెట్ పై సర్వత్ర ఆసక్తి నెలకొంది. 2025 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని ప్రధాని నరేంద్ర మోదీ, గత వారం తన దావోస్ పర్యటనలో వ్యాఖ్యానించిన నేపథ్యంలో, ఆర్థిక వృద్ధిని మెరుగుపరిచే నిర్ణయాలతో పాటు ప్రజలకు ఆనందాన్ని కలిగించే నిర్ణయాలూ కొన్ని ఈ బడ్జెట్ లో వెలువడవచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని ఓటర్లను, చిన్న చిన్న వ్యాపారులకు మేలు కలిగేలా తాయిలాలను జైట్లీ తీసుకు వస్తారని అంచనా వేస్తున్నారు. గడచిన రెండు సంవత్సరాలతో పోలిస్తే ఆర్థిక వ్యవస్థలో వృద్ధి రేటు పెరిగినట్టు సంకేతాలు కనిపిస్తున్నా, పంట దిగుబడి తగ్గడం, లక్షలాది మంది యువత నిరుద్యోగులుగా మిగులుతుండటం, జీఎస్టీపై ఇంకా పూర్తి అవగాహన పెరగక పోవడం, నోట్ల రద్దు తరువాత ఏర్పడిన పరిణామాలు మోదీ సర్కారుకు అడ్డంకులుగానే భావించవచ్చు. మార్చి 2018తో ముగిసే ఆర్థిక సంవత్సరం చివరకు స్థూల జాతీయోత్పత్తి రేటు 6.5శాతానికి తగ్గుతుందని ప్రభుత్వం గత అంచనాలను సవరించుకోవడానికి కూడా ఈ అడ్డంకులే కారణం. 6.5 శాతం వృద్ధి రేటు నాలుగేళ్ల కనిష్ఠం కాగా, భవిష్యత్తులో ఇది రెండంకెల సంఖ్యకు చేరుతుందని కూడా మోదీ సర్కారు ఘంటాపథంగా చెబుతున్న పరిస్థితి.
ఇక ఈ బడ్జెట్ లో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను పెంచేలా అరుణ్ జైట్లీ పలు కీలక నిర్ణయాలు ప్రకటిస్తారని తెలుస్తోంది. సాధారణ ఎన్నికలకు ముందు చివరి బడ్జెట్ కావడంతో పంటల బీమా, గ్రామాల్లో గృహ నిర్మాణాలకు పెద్ద పీట వేయవచ్చని సమాచారం. ఈ విషయాన్ని పేరును వెల్లడించేందుకు ఇష్టపడని ఓ ఆర్థిక శాఖ అధికారి స్వయంగా వెల్లడించారు. ఉద్యోగ సృష్టి, వృద్ధి రేటుకు ఉద్దీపన ఈ బడ్జెట్ లక్ష్యాలని ఆయన అన్నారు. రైతులకు ప్రోత్సాహకాలు, చిన్న వ్యాపారులకు అండగా నిలిచేలా నిర్ణయాలు కూడా ఉంటాయని ఆయన అన్నారు.
జీఎస్టీ అమలులోకి వచ్చిన తరువాత కేంద్ర ప్రభుత్వానికి దూరమయ్యారని భావిస్తున్న కొన్ని వర్గాలను తిరిగి అక్కున చేర్చుకునేందుకు కూడా జైట్లీ కొన్ని నిర్ణయాలను ప్రకటిస్తారని భావిస్తున్నారు. ఇక మౌలిక రంగంలోకి వస్తే, మరిన్ని జాతీయ రహదారులు, రైల్వే లైన్ల అభివృద్ధికి కూడా భారీగా కేటాయింపులు ఉండవచ్చని తెలుస్తోంది. గత సంవత్సరం నవంబర్ లోనే బడ్జెట్ ప్రతిపాదనల కసరత్తు ప్రారంభించిన జైట్లీ, ఈ మేరకు కొన్ని సంకేతాలను ఇచ్చారు కూడా. గ్రామీణాభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు తాను ప్రాధాన్యత ఇస్తానని జైట్లీ వెల్లడించారు.
ఇక జైట్లీకి ఉన్న ప్రధాన అడ్డంకుల్లో ఒకటి ద్రవ్య లోటు. జీడీపీలో 3.2 శాతంగా ఉన్న ద్రవ్యలోటు, ఈ బడ్జెట్ లో మరింతగా పెరగవచ్చన్న అంచనాలు ఉన్నాయి. ఆర్థిక వ్యవస్థ తగ్గుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో బడ్జెట్ సమతుల్యత అంత సులభమైన పనేమీ కాదని ప్రముఖ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ సంస్థ గోల్డ్ మన్ సాక్స్ వ్యాఖ్యానించింది. ఇప్పటికే ద్రవ్యోల్బణం పెరిగిందని, ద్రవ్య లభ్యత కఠినమైందని, బాండ్ మార్కెట్ పరిస్థితి కూడా అంతంతమాత్రంగానే ఉందని గుర్తు చేసింది.ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మరో ముఖ్య విషయం, ఆదాయం పెంచుకునేందుకు ప్రభుత్వం ముందున్న మార్గాలు చాలా తక్కువగా ఉన్నాయి.
మొత్తం పన్ను వసూళ్లలో దాదాపు సగ భాగం ఉన్న పరోక్షపన్నులు ఇప్పుడు జీఎస్టీ పరిధిలోకి వెళ్లిపోయాయి. ఇదే సమయంలో ప్రత్యక్ష పన్నులు, కార్పొరేట్ పన్నులు, వ్యక్తిగత పన్నులపై మాత్రం ఆర్థిక శాఖ నియంత్రణ కొనసాగనుంది. సాలీనా రూ. 50 కోట్ల కన్నా తక్కువ టర్నోవర్ ఉన్న కంపెనీల్లో, జీఎస్టీ తరువాత ఏర్పడిన ఆగ్రహాన్ని చల్లార్చేందుకు జైట్లీ కొన్ని రాయితీలను ప్రకటించవచ్చని కూడా తెలుస్తోంది.ఇక 2018-19లో ప్రభుత్వ రంగ కంపెనీల్లో వాటాల విక్రయం ద్వారా కనీసం లక్ష కోట్ల రూపాయలను ఖజానాకు చేర్చేందుకు మోదీ సర్కారు నిర్ణయం తీసుకుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో, అందుకు తగ్గ రూట్ మ్యాప్ ను తన బడ్జెట్ ప్రతిపాదనల్లో భాగంగా జైట్లీ వెల్లడిస్తారని తెలుస్తోంది.
ఈ సంవత్సరం వాటాల విక్రయం ద్వారా రూ. 72,500 కోట్లను సమీకరించాలని భావించిన కేంద్రం, ఏకంగా రూ. 92,500 కోట్లను సమీకరించింది. సమీప భవిష్యత్తులోనే ప్రభుత్వ రంగ ఎయిర్ ఇండియాలో వాటాల విక్రయాన్ని తెరపైకి తేవచ్చని కూడా ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ సంవత్సరం తొలి ఆరు నెలల వ్యవధిలోనే ఎయిర్ ఇండియాలో 49 శాతం వాటాల విక్రయం పూర్తవుతుందని కూడా అంచనా. ఇక అత్యధికులు ఎదురుచూసే, వ్యక్తిగత ఆదాయపు పన్ను స్లాబ్ లు ఈ సంవత్సరం మారే అవకాశాలు కనిపించడం లేదు. ఇదే సమయంలో పన్ను చెల్లింపుదారులకు స్వల్ప ఊరటను ఇచ్చే నిర్ణయాలను జైట్లీ ప్రకటిస్తారని ఆర్థిక శాఖ వర్గాలు అంటున్నాయి.