Deepika Padukone: మా అమ్మ, నాన్న గర్వపడ్డారు: దీపికా పదుకొనే
- బెదిరింపులను తట్టుకుని నిలబడేలా నా తల్లిదండ్రులు పెంచారు
- పరిస్థితిని హ్యాండిల్ చెయ్యగలనని వారికి తెలుసు
- సినిమా చూడగానే వీడియో కాల్ చేశారు
‘పద్మావత్’ సినిమా విషయంలో ఆ చిత్రం యూనిట్ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కుంది. దీపికా పదుకునే రాజ్ పుత్ కర్ణి సేనకు ప్రధాన లక్ష్యంగా మారింది. ఒక దశలో దీపిక తలకు వెలకట్టిన నిరసనకారులు ఆమె చెవి, ముక్కు కోసిన వారికి నగదు బహుమతినిస్తామని ప్రకటించారు కూడా. అయినప్పటికీ, దీపిక ఎలాంటి ఆందోళన వ్యక్తం చేయలేదు. నిరసనకారులకు దీటైన సమాధానం చెప్పే ప్రయత్నం చేసింది.
ఇక తీవ్ర నిరసనల మధ్య విడుదలైన ‘పద్మావత్’ మంచి టాక్ తో నడుస్తోంది. ఈ క్రమంలో తీవ్ర భావోద్వేగానికి గురైన దీపిక మాట్లాడుతూ, బెదిరింపులను తట్టుకుని నిలబడేలా పేరెంట్స్ తమను పెంచారని తెలిపింది. ఈ వివాదం రేగిన సందర్భంలో ఒక్కసారి కూడా తమ పేరెంట్స్ ‘నీ దగ్గరకు వచ్చి ఉంటాం’ అని అనలేదని చెప్పింది. ఎందుకంటే ఈ పరిస్థితిని తాను హ్యాండిల్ చేయగలనని వాళ్లకు తెలుసని తెలిపింది.
ఏది తప్పు, ఏది ఒప్పు అని తెలుసుకునేలా తనను పెంచారని చెప్పింది. తనకు, తన చెల్లెలికి ధైర్యం తల్లిదండ్రులేనని తెలిపింది. ‘పద్మావత్’ సినిమా చూసిన వెంటనే వీడియో కాల్ చేశారని, ఆ సమయంలో వారి ముఖాలు గర్వంతో, ఆనందంతో వెలిగిపోయాయని చెప్పింది.