tatkaal: తత్కాల్ పాస్‌పోర్టుల జారీలో కొత్త సవరణ... ఇక మరింత సులభతరం!
- ఇక నుంచి ఉన్నతాధికారి సిఫారసు తప్పనిసరి కాదు
- స్పష్టం చేసిన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
- సరైన ధ్రువీకరణ పత్రాలు ఉంటే చాలు
కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తత్కాల్ పాస్‌పోర్టుల జారీలో కొత్త సవరణలను ప్రవేశపెట్టింది. ఈ సవరణల మేరకు పాస్‌పోర్టుకి దరఖాస్తు చేసుకునే సమయంలో ఉన్నతాధికారి సిఫారసు తప్పనిసరి కాదని వెల్లడించింది. ఈ సడలింపు వల్ల తత్కాల్ పాస్‌పోర్ట్ జారీ మరింత సులభతరం కానుంది. ఈ నిబంధన వల్ల అవకాశం ఉన్నప్పటికీ ఎక్కువ మంది తత్కాల్ పాస్‌పోర్ట్‌కి దరఖాస్తు చేసుకోలేక పోతున్నారని, ఇప్పుడు ఈ సడలింపు ఇవ్వడం వల్ల దరఖాస్తుల సంఖ్య పెరిగే అవకాశముందని విదేశీ వ్యవహారాలు, విదేశాల్లో భారత వ్యవహారాల కార్యదర్శి జేడీ ధ్యానేశ్వర్ ములే అన్నారు.
ఈ నిబంధన జనవరి 25, 2018 నుంచి అమల్లోకి వచ్చిందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. భారత ప్రభుత్వం దేశ ప్రజలను పూర్తిగా విశ్వసిస్తోందని, ప్రజలకు అనుకూలంగా పాలసీలు ఉండాలనే నేపథ్యంలో మంత్రిత్వ శాఖ ఇలాంటి నిర్ణయం తీసుకుందని ఆయన అన్నారు. దరఖాస్తుదారులు అన్నీ సరైన ధ్రువీకరణ పత్రాలు సమర్పించినట్లయితే మరే ఇతర మధ్యవర్తుల సిఫార్సులు అవసరం ఉండదని, కేవలం మూడు రోజుల్లో పాస్‌పోర్టు జారీ చేస్తామని ఆయన తెలిపారు.