ramgopal verma: రాంగోపాల్ వర్మపై అసిస్టెంట్ జయకుమార్ తీవ్ర ఆరోపణలు!
- వర్మ హాలీవుడ్ నిర్మాత హార్వే వీన్ స్టీన్ లాంటివాడు
- భవిష్యత్ ఉంటుందని వర్మతో కలిసి పని చేశాను
- వర్మలో మరో మనిషి ఉన్నాడు
దర్శకుడు రాంగోపాల్ వర్మ, అతని వద్ద అసిస్టెంట్ గా పనిచేసిన రచయిత పి.జయకుమార్ ల మధ్య 'జీఎస్టీ' చిత్రం రేపిన వివాదం అభిమానులకు ఆసక్తికరంగా మారింది. రాంగోపాల్ వర్మ తన జీఎస్టీ కధను దొంగిలించాడని జయకుమార్ ఆరోపించగా, తన ఆఫీసులో జయకుమార్ చాలా సార్లు దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడని వర్మ ప్రత్యారోపణ చేశాడు. దీంతో జయకుమార్ మరింత తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఆయనను హాలీవుడ్ లో అనేక మంది తారల జీవితాలతో ఆడుకున్న హార్వే వీన్ స్టీన్ తో పోల్చాడు.
విజయవంతమైన వ్యక్తులతో పనిచేస్తే భవిష్యత్తు ఉంటుందని ఆశించడం సహజమని, తాను కూడా అలాగే అనుకుని వర్మతో కలిసి పని చేశానని అన్నారు. కానీ ఆయనలో మరో మనిషి ఉన్నాడని ఆయన చెప్పారు. తాను ఆయనలోని స్వలింగసంపర్క స్వభావాన్ని బయటపెట్టాలనుకోవడం లేదని, కానీ ఆయన లైంగిక వేధింపులను వ్యతిరేకించాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు.
‘మీ టూ’ తరహాలో ఆర్జీవీ అకృత్యాలకు వ్యతిరేకంగా పోరాడాలని పేర్కొన్న ఆయన, వర్మ ఎందరో యువ కళాకారులు, రచయితలను వేధించాడని ఆరోపించారు. బాధితులంతా 'మీ టూ ఆర్జీవీ' క్యాంపెయిన్ లో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. దీనిపై స్పందించిన వర్మ జీఎస్టీ స్క్రిప్టు తనదేనని, దానిని హ్యాక్ చేశాననడంలో నిజం లేదని పేర్కొంటూ ప్రెస్ నోట్ ఒకటి విడుదల చేశాడు.