vishwa hindu parishat: జామా మసీదులో హిందూ దేవుళ్ల ఫొటోలు పెట్టే ధైర్యం ఉందా?: వీహెచ్ పీ నేత ప్రవీణ్ తొగాడియా
- కోటప్పకొండ ఘటనపై మండిపడ్డ తొగాడియా
- దేవాలయాలపై ప్రభుత్వ పెత్తనం వదిలివేయాలి
- సిలువ, నెలవంక బొమ్మలను ఏపీ ప్రభుత్వం తొలగించాలి
- హిందూ సమాజం నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది: తొగాడియా
కోటప్పకొండలో ఏర్పాటు చేసిన శివుడి ప్రతిమ పక్కనే సిలువను, నెలవంక ప్రతిమలను కూడా ఏర్పాటు చేయడం పెను దుమారాన్ని రేపుతోంది. ఈ నేపథ్యంలో హిందూ సంఘాల నేతలు నిరసనలకు దిగుతున్నారు. ఈ సంఘటనపై వీహెచ్ పీ చీఫ్ ప్రవీణ్ తొగాడియా స్పందించారు. కేవలం హిందూ దేవాలయాలను మాత్రమే ప్రభుత్వం అధీనంలోకి తీసుకుని ఎందుకు పాలిస్తోందని ఆయన ప్రశ్నించారు.
దేవాలయాలపై ప్రభుత్వ పెత్తనం పోవాలని, హిందూ దేవాలయాలకు స్వేచ్ఛ నివ్వాలని డిమాండ్ చేశారు. హిందూ దేవాలయాల ద్వారా ఎంతో ఆదాయం వస్తోందని, కోటప్ప కొండలో శివుడి విగ్రహం పక్కన సిలువ, మసీదు బొమ్మలు ఎలా వేస్తారని అడిగితే మతసామరస్యం అంటున్నారని, అదే సామరస్యంతో ఢిల్లీలోని జామా మసీదులో హిందూ దేవుళ్ల ఫొటోలు పెట్టే ధైర్యం ఉందా? అని తొగాడియా ప్రశ్నించారు. శివుడి ప్రతిమ పక్కన ఏర్పాటు చేసిన సిలువ, నెలవంక బొమ్మలను ఏపీ ప్రభుత్వం తొలగించాలని, లేదంటే హిందూ సమాజం నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందని హెచ్చరించారు.