New Delhi: ఇదీ మా సత్తా... పది దేశాల అధినేతల ముందు బలాన్ని చూపిన ఇండియా!

  • ఘనంగా 69వ గణంతంత్ర దినోత్సవ వేడుకలు
  • 100 అడుగుల భారీ వేదికపై ఆసీనులైన పది దేశాల అధినేతలు
  • ఆకర్షించిన యుద్ధ విమానాలు, క్షిపణులు

69వ గణతంత్ర వేడుకలు దేశ రాజధాని న్యూఢిల్లీలో ఘనంగా మొదలయ్యాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా 10 ఆసియాన్ దేశాలకు చెందిన అధినేతలు ఆసీనులైన వేళ, రాజ్ పథ్ లో నిర్వహించిన సైనిక పరేడ్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. ఇండియా సార్వభౌమత్వాన్ని ప్రదర్శిస్తూ, వివిధ రకాల అత్యాధునిక క్షిపణులు, సైనికుల విన్యాసాలతో సాగిన పరేడ్ ను ప్రజలతో పాటు పది దేశాల అధినేతలు కన్నార్పకుండా తిలకించారు.

అంతకుముందు పది దేశాల అధినేతలూ ఒక్కొక్కరుగా రాజ్ పథ్ కు వస్తుండగా, ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఆహ్వానం పలికారు. ఆపై రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, త్రివిధ దళాధిపతులు వారికి షేక్ హ్యాండ్ ఇచ్చారు. అమర వీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, రాజ్ పథ్ కు రావడంతో గణతంత్ర వేడుకలు అధికారికంగా మొదలయ్యాయి.

కాగా, దాదాపు 100 అడుగుల పొడవైన వేదికను అతిథుల కోసం ఏర్పాటు చేయగా, వారి భద్రత నిమిత్తం 60 వేల మంది సిబ్బందిని కేంద్రం ఏర్పాటు చేసింది. ఢిల్లీ పోలీసులతో పాటు బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, ఆర్ఏఎఫ్ సహా వివిధ విభాగాలు భాగస్వామ్యమయ్యాయి. చుట్టుపక్కల భవనాలపై స్నిప్పర్స్ ను ఏర్పాటు చేశారు. ఎయిర్ ఫోర్స్ సీ-130 జే సూపర్ హెర్క్యులెస్, సీ-17 గ్లోబ్ మాస్టర్, సుఖోయ్ - 30 ఎంకేఐ ఎస్, లైట్ కాంబాట్ తేజాస్ విమానాలు గాల్లో చేసిన విన్యాసాలు అందరినీ ఆకర్షించాయి. సైన్యానికి చెందిన టీ-90 ట్యాంకులు, బ్రహ్మోస్ మిసైల్స్, ఆకాష్ వెపన్ సిస్టమ్లతో పాటు 113 మంది మహిళలతో కూడిన 'సీమా భవానీ' పరేడ్ లో కదులుతున్న వేళ ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. బైకులపై జవాన్లు చేసిన విన్యాసాలు కూడా ఆకర్షించాయి.

  • Loading...

More Telugu News