Chiranjeevi: నాలాగ నాగశౌర్య నిరుత్సాహపడకూడదనే ‘ఛలో’ ఫంక్షన్ కు వచ్చాను!: మెగాస్టార్ చిరంజీవి
- నాగశౌర్య వంటి నటులు ఇండస్ట్రీకి రావాలి
- నాడు నా సినిమా ఫంక్షన్ కు ఓ పెద్దస్టార్ ని ఆహ్వానిస్తే .. కుదరదన్నారు
- అప్పుడు చాలా నిరుత్సాహపడ్డా
- ఆ నిరుత్సాహం నాగశౌర్య పడకూడదని ఇక్కడికి వచ్చా: చిరంజీవి
నాగశౌర్య చాలా బాగున్నాడని, ఇలాంటి నటులు ఇండస్ట్రీకి రావాలని, అలాంటి వాళ్లు రావడం వలన ఫ్రెష్ నెస్ తో పాటు కొత్తరక్తం సినీ ఇండస్ట్రీకి వచ్చినట్టవుతుందంటూ మెగాస్టార్ చిరంజీవి ప్రోత్సహించారు. నాగశౌర్య తాజా చిత్రం 'ఛలో' ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి మాట్లాడుతూ, ‘ఈ సినిమాకు నన్ను ముఖ్యఅతిథిగా రావాలని పిలవడానికి నాగశౌర్య, తన తల్లితో కలిసి నా వద్దకు వచ్చాడు. అతను అడిగిన వెంటనే ‘వస్తానని’ అని చెప్పేశాను.
ఎందుకంటే, నా కెరీర్ మొదటిరోజులు నాకు గుర్తుకొచ్చాయి. ఆ రోజుల్లో నేను నటించిన ఓ సినిమా వంద రోజుల వేడుకకు నేను అభిమానించే ఓ పెద్ద స్టార్ ని ఆహ్వానించేందుకు వెళ్లాం. ఆ పెద్ద స్టార్ బిజీగా ఉండటంతో ‘నేను రాలేకపోతున్నాను, ఏమీ అనుకోవద్దు’ అని చెప్పారు. ఆ స్టార్ లేకుండా జరిగిన ఆ ఫంక్షన్ ఏదో తూతూ మంత్రంగా జరిగింది. ఆరోజున చాలా నిరుత్సాహంగా అనిపించింది. ఆ స్టార్ వచ్చి ఉంటే కనుక ఆ ఉత్సాహం, ప్రోత్సాహం వేరుగా ఉండేది.
ఆ సంఘటన గుర్తొచ్చినప్పుడు నాగశౌర్యలో నన్ను నేను చూసుకున్నా. ఈ ఫంక్షన్ కు నేను రావాలని నాగశౌర్య కోరుకుంటున్నాడంటే.. అతను పొందే ఉత్సాహం, ప్రోత్సాహం వేరని నేను భావించా. అందుకే, అతన్ని ప్రోత్సహించాలని భావించి ఈ ఫంక్షన్ కు నేను వచ్చాను’ అని చిరంజీవి అన్నారు. కాగా, వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నాగశౌర్య సరసన రష్మిక మందన కథానాయికగా నటించింది.