Telangana: తెలంగాణాకు కేంద్రం మ‌రింత స‌హ‌కరించాలి: మంత్రి జూపల్లి వినతి

  • హైదరాబాద్ లో కేంద్ర మంత్రి న‌రేంద్ర‌సింగ్ తోమ‌ర్‌తో జూపల్లి భేటీ
  • పీఎంజీఎస్ వై-2 లో 1230 కి.మీ రోడ్ల‌ను చేర్చాలి
  • గ‌తంలో జ‌రిగిన న‌ష్టాన్ని స‌రిచేయాలి

కొత్త‌గా ఏర్ప‌డ్డ తెలంగాణా రాష్ట్రం అన్ని రంగాల్లో వేగంగా ముందుకు పోతోందని, త‌మ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మ‌రింత స‌హ‌కారం అందించాల‌ని కేంద్ర ప్రభుత్వాన్ని పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు కోరారు. హైదరాబాద్ లోని రాజేంద్ర‌న‌గ‌ర్‌లో ఉన్న జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి న‌రేంద్ర‌సింగ్ తోమ‌ర్‌తో ఈరోజు ఆయన బేటీ అయ్యారు.

ఈ సంద‌ర్భంగా రాష్ట్రంలో అమ‌లవుతున్న ప‌లు కేంద్ర ప‌థ‌కాల‌పై, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా రాష్ట్రానికి వివిధ ప‌థ‌కాల ద్వారా రావాల్సిన నిధుల‌పై చ‌ర్చించారు. అలాగే 14వ ఆర్థిక సంఘం ద్వారా గ్రామ పంచాయ‌తీల‌కు నిధులు ఇస్తున్న విధంగానే మండ‌ల‌, జిల్లా ప‌రిష‌త్‌ల‌ బ‌లోపేతానికీ నిధులు మంజూరు చేసే అంశాన్ని ప‌రిశీలించాల‌ని కోరారు.  

2002-03 ఆర్థిక సంవ‌త్స‌రంలో ర‌హ‌దారి సౌక‌ర్యం ఉన్న హాబిటేష‌న్స్ విష‌యంలో ఇచ్చిన నివేదిక‌లో జ‌రిగిన పొర‌పాటు కార‌ణంగా తెలంగాణాకు న‌ష్టం జ‌రిగింద‌ని, దీనిపై ఇప్ప‌టికే కేంద్రం బృందం కూడా స‌ర్వే చేసి నివేదిక‌లు ఇచ్చిన‌ విషయాన్ని తోమర్ కు జూప‌ల్లి గుర్తు చేశారు. ఆ పొర‌పాటును స‌వ‌రించి త‌క్ష‌ణ‌మే తెలంగాణాలోని 535 హ్యాబిటేష‌న్ల ప‌రిధిలో 1230 కిలో మీట‌ర్ల పొడ‌వైన ర‌హ‌దారుల నిర్మాణానికి ప్ర‌ధాన‌మంత్రి గ్రామీణ స‌డ‌క్ యోజ‌న (పీఎంజీఎస్ వై) కింద రూ.8 వంద‌ల కోట్ల నిధులు విడుద‌ల చేయాల‌ని కోరారు. 

  • Loading...

More Telugu News