indian railway: 11వేల రైళ్లలో 12 లక్షల సీసీ కెమెరాలు... యోచిస్తోన్న భారతీయ రైల్వే
- దేశవ్యాప్తంగా 8,500ల స్టేషన్లలో కూడా
- 2018 బడ్జెట్‌లో రూ. 3000 కోట్లు కేటాయించే అవకాశం
- ఒక్కో కోచ్‌లో 8 కెమెరాలు
ప్రయాణికుల రక్షణ, భద్రతలను పెంపొందించే ఉద్దేశంతో 11 వేల రైళ్లలో 12 లక్షల సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు భారతీయ రైల్వే యోచిస్తోంది. రైళ్లతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న 8,500 రైల్వే స్టేషన్లలో కూడా కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం 2018 బడ్జెట్‌లో రూ. 3000 కోట్లు కేటాయించనున్నట్లు సమాచారం. ఒక్కో కోచ్‌లో ఎనిమిది కెమెరాలు ఏర్పాటు చేసి ప్రయాణికులను పర్యవేక్షించనున్నారు.
భారతీయ రైల్వేలో ఇప్పటివరకు 395 రైళ్లు, 50 రైల్వే స్టేషన్లలో మాత్రమే పూర్తిస్థాయి సీసీటీవీ సర్వైలెన్స్ అందుబాటులో ఉంది. కొత్తగా అమర్చబోయే కెమెరాల్లో రికార్డయ్యే ఫుటేజీని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ వారు నిరంతరం పర్యవేక్షించనున్నారు. ఈ సెక్యూరిటీ ఫుటేజీల మీద స్టేషన్ మాస్టర్‌లకు కూడా నియంత్రణాధికారాలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా మహిళల కంపార్ట్‌మెంట్లలో ఎక్కే పురుషులను గుర్తించడానికి ముంబై లోకల్ రైళ్లలో ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాలను కూడా ఏర్పాటు చేయనున్నారట. అయితే పర్యవేక్షణ పేరుతో వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలగనుందనే అభ్యంతరం కూడా లేకపోలేదు.