Chandrababu: చంద్రబాబు 24/7 కాదు 25/8 పనిచేస్తున్నారు: గవర్నర్ నరసింహన్ ప్రశంసలు
- విశాఖ జిల్లాలోని సౌభాగ్యరాయపురంలో పర్యటించిన గవర్నర్
- ఏపీ ప్రభుత్వ సుపరిపాలనతో ప్రజలు సంతోషంగా ఉన్నారు
- రాష్ట్ర సమగ్రాభివృద్ధిని కాంక్షిస్తున్న చంద్రబాబు: నరసింహన్
ఏపీ ప్రభుత్వ సుపరిపాలనతో ప్రజల ముఖాల్లో సంతోషం వెల్లివిరుస్తోందని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ప్రశంసించారు. విశాఖపట్టణం జిల్లాలోని పెందుర్తి మండలం సౌభాగ్యరాయపురం గ్రామాన్ని ఈరోజు ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పథకాల అమలు తీరుపై లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించారు.
ఈ సందర్భంగా నరసింహన్ మాట్లాడుతూ, ఏపీ ప్రభుత్వ సుపరిపాలనతో ప్రజలు సంతోషంగా ఉన్నారనే విషయాన్ని గణతంత్ర దినోత్సవం రోజున ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి చెప్పబోతున్నానని అన్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధిని, ప్రజా సంక్షేమాన్ని కాంక్షిస్తున్న చంద్రబాబు, 24/7 కాకుండా 25/8 గంటలు/రోజులు పనిచేస్తున్నారంటూ ప్రశంసలతో ముంచెత్తారు.
సౌభాగ్యరాయపురం గ్రామమైనప్పటికీ పట్టణ ప్రాంతానికి దీటుగా అన్ని వసతులతో బాగుందని, ఇక్కడి ప్రజలు సంతోషంగా, ఆనందంగా ఉండటం తాను గమనించానని గవర్నర్ సంతోషం వ్యక్తం చేశారు. ‘సౌభాగ్యరాయపురం’లోని ‘రాయ’ పదాన్ని తొలగించి ‘సౌభాగ్యపురం’గా ఆ గ్రామం పేరు మార్చాలని జిల్లా కలెక్టర్ కు ఈ సందర్భంగా గవర్నర్ సూచించారు.
కాగా, పెందుర్తి మండలం సంపూర్ణ ఓడీఎఫ్ ను సాధించిన నేపథ్యంలో ఎంపీపీ రెడ్డి వరలక్ష్మి నారాయణరావును నరసింహన్ అభినందించారు. ప్రభుత్వం తరపున ఒక లక్ష రూపాయలను ప్రోత్సాహక బహుమతిగా అందజేశారు. అనంతరం, అంగన్ వాడి, పాఠశాల చిన్నారులతో ఆయన ముచ్చటించారు.