apple: గతేడాది నాలుగో త్రైమాసికంలో ఐఫోన్ టెన్ అమ్మకాలు.. 29 మిలియన్లు
- నివేదికలో వెల్లడించిన మార్కెట్ రీసెర్చ్ సంస్థ కానలీస్
- చైనాలోనే 7 మిలియన్ల అమ్మకాలు
- ధర అధికంగా ఉన్నప్పటికీ ఎగబడి కొన్న వినియోగదారులు
గతేడాది నాలుగో త్రైమాసికంలో 29 మిలియన్ల ఐఫోన్ టెన్ ఫోన్లను ఆపిల్ సంస్థ అమ్మిందని సింగపూర్‌కి చెందిన మార్కెట్ రీసెర్చ్ సంస్థ కానలీస్ వెల్లడించింది. హాలీడే సీజన్‌లో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా అమ్ముడైన స్మార్ట్‌ఫోన్‌గా ఐఫోన్ టెన్ నిలిచిందని కానలీస్ తన నివేదికలో పేర్కొంది. ఈ 29 మిలియన్ల అమ్మకాల్లో ఒక్క చైనా దేశంలోనే 7 మిలియన్ల ఐఫోన్ టెన్ స్మార్ట్‌ఫోన్లు అమ్ముడయ్యాయని కానలీస్ తెలిపింది. 999 డాలర్ల ధర ఉన్నప్పటికీ వినియోగదారులు ఎగబడి కొన్నారని, కానీ వారి అంచనాలకు తగినట్లుగా ఐఫోన్ టెన్ పనితీరు లేదని వ్యాఖ్యానించింది.
ఐఫోన్ టెన్‌తో పాటు ఐఫోన్ ఎస్ఈ, 6ఎస్, ఐఫోన్ 7, ఐఫోన్ 8ల అమ్మకాలు కూడా నాలుగో త్రైమాసికంలో ఆశాజనకంగానే ఉన్నాయని కానలీస్ ప్రకటించింది. అయితే 2018లో ఐఫోన్ టెన్ ఉత్పత్తులను ఆపిల్ నిలిపివేయనున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ జనవరి-మార్చి త్రైమాసికంలో 18 మిలియన్ల ఫోన్లు అమ్ముడయ్యే అవకాశం ఉందని, దీంతో ఏకమొత్తంగా ఫోన్ విడుదలైన నాటి నుంచి ఉత్పత్తి నిలిపివేసే వరకు 62 మిలియన్ల యూనిట్లు అమ్ముడయ్యే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. దీన్ని బట్టి చూస్తే ఐఫోన్ టెన్ విడుదలకు ముందు, అమ్మకాల లక్ష్యంగా పెట్టుకున్న 80 మిలియన్ల మార్కును ఆపిల్ దాటలేక పోతుందని వారు అభిప్రాయపడుతున్నారు.